డబ్బు.. జాగ్రత్త!

Department of Finance has instructed all departments about budget allocations - Sakshi

అనుమతికి మించి పైసా కూడా వ్యయం చేయకూడదు

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మార్గదర్శకాలు 

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో 2020–21 ఆర్ధిక ఏడాదికి సంబంధించి మూడు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కేటాయింపులను జాగ్రత్తగా వ్యయం చేయాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. అనవసర రంగాలకు కాకుండా చాలా జాగ్రత్తగా అవసరమైన రంగాలకు మాత్రమే నిధులను వ్యయం చేయాలని పేర్కొంది. కేటాయింపులకు మించి పైసా కూడా శాఖలు వ్యయం చేయరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలాఖరు వరకు మూడు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కేటాయింపులను సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఆయా శాఖలకు పంపిణీ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

కోవిడ్‌–19 కారణంగా లాక్‌డౌన్‌ విధించినందున రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో శాఖాధిపతులు, డీడీవోలు గ్రాంట్లను స్తంభింప చేయకుండా ఆ నిధులను ఖజానాకు సరెండర్‌ చేయాలి.  
► పలుశాఖలు, రంగాలకు మూడు నెలలకు అనుమతించిన మేరకే వ్యయం చేయాలి. అంతకు మించి వ్యయం చేయకూడదు.  
► సంబంధిత పనులకు నిధులుంటేనే శాఖాధిపతులు బిల్లులను ప్రాసెస్‌ చేయాలి. బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ లేకుండా శిక్షణ (వైద్యం మినహా), ఫర్నీచర్‌ కొనుగోళ్లు, ప్రకటనల జారీ లాంటివి చేయకూడదు. ఇన్‌స్టిట్యూషన్లకు ఎటువంటి గ్రాంట్లను మంజూరు చేయకూడదు.
► కేంద్ర సహాయ, రాష్ట్ర అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత ఏజెన్సీ నుంచి నిధులు వచ్చిన తరువాత రాష్ట్ర వాటా 
నిధులను ఇవ్వాలి.  
► ఓటాన్‌ అకౌంట్‌ మూడు నెలల బడ్జెట్‌లో కొత్త పథకాలకు సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చిన తరువాతే నిధులు విడుదల చేయాలి.  
► వేతనాలు, పెన్షన్లు, సహాయ పునరావాసం తదితర అత్యవసర రంగాలకు బడ్జెట్‌ కంట్రోల్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులో పేర్కొంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top