కల చెదిరింది.. కన్నీరు మిగిలింది..!

Degree Student Dies Of Dengue Fever In Srikakulam - Sakshi

విధి వక్రీకరించింది. బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా పట్టుదలతో చదువుతున్న ఆ యువకుడిని డెంగీ జ్వరం రూపంలో మృత్యువు కబలించింది. కూలీనాలీ చేస్తూ చదివిస్తున్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద ఘటన రేగిడి మండలం చినశిర్లాం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

రేగిడి : మండలంలోని చినశిర్లాం గ్రామానికి చెందిన వజ్జిపర్తి తిరుపతిరావు(20) అనే డిగ్రీ విద్యార్థి డెంగీ జ్వరంతో మృత్యుఒడికి చేరాడు. వారం రోజులుగా జ్వరం రావడంతో తల్లిదండ్రులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులుల సూచనలు మేరకు విశాఖలోని ఓ ప్రైవేటు ఆకస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. ఓ వైపు చికిత్స అందించగా..మరోవైపు యువకుడు ప్లేట్‌లేట్స్‌ పడిపోయాయి. డెంగీ జ్వరం లక్షణాలతో తిరుపతిరావు బాధపడుతున్నట్లు అక్కడ వైద్యులు తెలిపారని, బంధువులు వద్ద అప్పు చేసి మెరుగైన వైద్యం అందిస్తుండగానే కుమారుడు మృత్యువాత పడ్డాడని తల్లిదండ్రులు బోరును విలపిస్తున్నారు.  

రెక్కలకష్టంతో చదివిస్తుండగా....
తిరుపతిరావు తల్లిదండ్రులు బుచ్చమ్మ, గురువులు రజక వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. ఓ వైపు రైతు పనులు చేస్తూ మరో వైపు కుల వృత్తి చేసుకుంటూ వచ్చిన అరకొర సొమ్ముతో తిరుపతిరావును, అతని సోదరుడు భవానీని చదివిస్తున్నారు. తిరుపతిరావు చదువులో చురుగ్గా ఉండటం, ఇంతలోనే మృత్యువు ఒడికి చేరడం ఆ కుటుంబాన్ని విషాదంలో నింపింది. వారం రోజులు క్రితం వరకు తమతో తిరిగే స్నేహితుడు ఇక లేడని తెలుసుకున్న తోటి స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చేతికందికొచ్చే కొడుకు మృతిచెందడంతో తండ్రి గురువులు సొమ్మసిల్లిపడిపోయాడు. ‘బ్యాంకు ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తానన్నావు..నాన్నా.. తిరుపతి....లే..’ అంటూ ఆ తండ్రి విలపించడం  అందరినీ కంటతడిపెట్టించింది. ‘అన్నయ్యా..బస్సులు తక్కువుగా ఉన్నాయి లే అన్నయ్యా..వేగంగా వెళదాం..’ అంటూ తిరుపతిరావు సోదరుడు భవాని మృతదేహంపై పడి రోదించడం అక్కడివారిని కలచివేసింది.

బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా..
డెంగీ జ్వరంతో మృతిచెందిన తిరుపతిరావు రాజాంలోని ఓ ప్రయివేటు కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఓ వైపు కాంపిటేటివ్‌ పరీక్షలకు చదువుతుండగా, మరో వైపు బ్యాంకు ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు తిరుపతిరావు స్నేహితులు విలేకరులకు తెలిపారు. తిరుపతిరావు మృతిపట్ల రాజాంలోని ఎస్‌ఎస్‌ఎన్‌డిగ్రీ కళాశాలకు సెలవు ప్రకటించారు. కళాశాల యాజమాన్యంతోపాటు స్నేహితులు మృతదేహం వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top