డీసీసీ అధ్యక్ష పదవికి దొమ్మేటి రాజీనామా | DCC President post Resignation venkateshwara | Sakshi
Sakshi News home page

డీసీసీ అధ్యక్ష పదవికి దొమ్మేటి రాజీనామా

Sep 21 2014 12:35 AM | Updated on Sep 2 2017 1:41 PM

మూలిగే నక్కపై తాటిపండు చందంగా తయారైంది జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. అసలే ‘విభజన’ శాపంతో సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కక కుదేలైన కాంగ్రెస్ పార్టీలో ఊహించని రీతిలో

 కాకినాడ, న్యూస్‌లైన్:మూలిగే నక్కపై తాటిపండు చందంగా తయారైంది జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. అసలే ‘విభజన’ శాపంతో సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కక కుదేలైన కాంగ్రెస్ పార్టీలో ఊహించని రీతిలో భారీ కుదుపు చోటు చేసుకుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా దొమ్మేటి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నట్టు దొమ్మేటి తన లేఖలో పేర్కొన్నారు. 2004లో తాళ్లరేవు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున దొమ్మేటి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2009లో టికెట్ ఆశించి భంగపడ్డాడు.
 
 2012లో అప్పటి డీసీసీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన స్థానంలో దొమ్మేటిని నియమించారు. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజుకు అనుచరునిగా కొనసాగుతున్న దొమ్మేటి ప్రస్తుతం పళ్లంరాజు ఒత్తిడి మేరకే రాజీనామా చేసినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దొమ్మేటి స్థానంలో డీసీసీ అధ్యక్షునిగా ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ను నియమించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. పదవికి రాజీనామా చేసిన దొమ్మేటి ప్రస్తుతానికి పార్టీలోనే కొనసాగుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌లో కొనసాగడం వల్ల రాజకీయ ఎదుగుదల ఉండదన్న భావనతో పార్టీనీ వీడే అవకాశాలున్నాయని అంటున్నారు. త్వరలోనే అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరితే మేలని ఆయన అనుచరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement