ఎండ ప్రచండం! | Sakshi
Sakshi News home page

ఎండ ప్రచండం!

Published Sat, Apr 23 2016 1:54 AM

ఎండ ప్రచండం!

జిల్లాలో అనూహ్యంగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
రెంటచింతల, పిడుగురాళ్ల, వినుకొండ ప్రాంతాల్లో మరింత దారుణం
గత ఏడాదితో పోల్చితే  9 డిగ్రీల అధికంగా నమోదు
బయటకు రావాలంటేనే  బెంబేలెత్తుతున్న జనం
అల్లాడుతున్న చిన్నారులు, వృద్ధులు, చిరువ్యాపారులు

 
 
 రెంటచింతల   45.8
 పిడుగురాళ్ల   45.7
 గుంటూరు   43.5

 
గుంటూరు రూరల్ : ఎండ ప్రచండం కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మూడో వారంలోనే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. భగభగ మండుతున్న ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా  పిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటలు దాటితే చాలు..బయటకు రావాలంటేనే వెనుకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండ దెబ్బకు ప్రయాణాలనూ వాయిదా వేసుకుంటున్నారు. సాయంత్రం ఆరు దాటిందాకా ఇళ్ల నుంచి రావడం లేదు.

రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితీ కడుదయనీయంగా మారింది. ఒక పక్క ఎండ..మరో పక్క వడగాడ్పులకు రోడ్లపై  ఉండలేక విలవిల్లాడిపోతున్నారు. వ్యాపారాలు పూర్తిగా మందగించాయని అంటున్నారు. కొందరు వడదెబ్బకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ వారం రోజుల్లో  9 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ నెల మూడో వారంతో ఈ ఏడాది పోల్చితే ఉష్ణోగ్రతలో విపరీత మార్పులు కన్పిస్తున్నాయి.


 ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు...
రాత్రి ఉష్ణోగ్రతలు సైతం రెండు మూడు డిగ్రీలు పెరగడంతో వేడిగాలులు వీస్తున్నాయి. ప్రజలు వేడిమి తట్టుకోక ఉపశమనాలను వెతుక్కుంటున్నారు.  రెండు రోజుల్లో గమనిస్తే ఉదయం సాయంత్రం రెండు డిగ్రీల చొప్పున రోజుకు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అత్యధికంగా వేడిమి పెరిగిపోయింది. ఇక జిల్లాలోని అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే రెంటచింతల, వినుకొండ, పిడుగు రాళ్ళ తదితర ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. వారం రోజుల్లో రోజూ 42 నుంచి 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


 గత ఏడాది... ఈ ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలు...
గత ఏడాది ఏప్రిల్ మూడో వారంలో కేవలం గుంటూరులో వరుసగా ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి.  ఏప్రిల్ 17న 36.8, 18న 35.3, 19న 35.2, 20న 35.4, 21న 35.6, 22న 36 డిగ్రీల ఉష్ణోగ్రతనమోదయింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు చూస్తే సుమారు 25 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు ఉన్నాయి. ఇక ఈ ఏడాది గడచిన వారంలో చూస్తే ఆదివారం 39.5, సోమవారం 39.5, మంగళవారం 39.5, బుధవారం 39.8, గురువారం 41.5 శుక్రవారం ఏకంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీల వరకు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement