నేడు తెప్పోత్సవం

Dassehra Sarannavaratri celebrations on Indrakeeladri In Vijayawada - Sakshi

ఉదయమంతా భక్తితన్మయత్వం.. సాయంత్రం సాంస్కృతిక వైభోగం.. వెరసి ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లింది. వేల సంఖ్యలో తరలివచ్చిన భవానీలతో కొండ సిందూర శోభిమైంది. జగన్మాత కనకదుర్గమ్మ తొమ్మిదో రోజు సోమవారం మహిషాసురమర్దనిగా దర్శనమిచ్చారు. శక్తిస్వరూపిణిని దర్శించుకుని భక్తకోటి తరించింది. మరోవైపు విజయదశమినాడు ఆది దంపతుల జలవిహారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం కృష్ణమ్మ ఒడిలో నిర్వహించిన తెప్పోత్సవం ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. 

సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. పదో రోజు మంగళవారం మధ్యాహ్నం దేవస్థానం అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణాహుతిని నిర్వహించి దసరా ఉత్సవాలను ముగిస్తారు. 9వ రోజు నవమి నాడు అమ్మవారు ఉగ్రరూపమైన శ్రీ మహిషాసురమర్దనీదేవిగా దర్శనమిచ్చారు. ఇక ఆఖరి రోజు దశమి నాడు శాంతస్వరూపిణి శ్రీరాజరాజేశ్వరీదేవిగా కొలువుదీరుతారు.

జలవిహారానికి ఏర్పాట్లు పూర్తి..
గత పక్షం రోజులుగా వరద ఉధృతితో పోటెత్తిన కృష్ణమ్మ ప్రస్తుతం శాంతించింది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద గేట్లు మూసివేశారు. దీంతో తెప్పోత్సవానికి అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. మంగళవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ గంగా పార్వతీసమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లు నదీ విహారం చేయనున్నారు. ఈ మేరకు దేవదాయ, జలవనరులు, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య తెప్పోత్సవం నిర్వహిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ ప్రకటించారు. కాగా సోమవారం సాయంత్రం తెప్పోత్సవం ట్రయిల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు. 

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..
భవానీభక్తులు రాకతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. దీక్షలు తీసుకున్న భక్తులు అమ్మవారి సన్నిధి చేరుకుని హోమ గుండాల్లో పూజాద్రవ్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుంటారు. కృష్ణవేణి ఘాట్‌ భవానీభక్తులతో నిండిపోయింది. కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించిన భక్తులు కృష్ణవేణి ఘాట్‌లో జల్లు స్నానాలు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల నుంచి భవానీమాలలు ధరించిన భక్తులు లారీల్లో తరలివస్తున్నారు. 

బుధ, గురువారంల్లోనూ రద్దీ..
సోమ, మంగళవారాల్లోనే కాకుండా తర్వాత మరో రెండు రోజులు భవానీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. అందువల్ల బుధ, గురువారాల్లోనూ దీక్షల విరమణకు కావాల్సిన ఏర్పాట్లు అధికారులు కొనసాగిస్తున్నారు. 

అమ్మవారి దర్శనభాగ్యం దక్కేనా!  
తాడేపల్లి రూరల్‌ : దేవీ నవరాత్రులు చివరి రోజు అమ్మవారి తెప్పోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరిస్తారు. కానీ గత ఐదేళ్లుగా పక్కనే ఉన్న గుంటూరు జిల్లా వాసులకు మాత్రం కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై అమ్మవారి దర్శనభాగ్యం కలగడం లేదు. 2014 ముందు దుర్గా ఘాట్‌ వద్ద ప్రారంభమయ్యే తెప్పోత్సవం గుంటూరు జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ 10 కానా వద్దకు వచ్చి తిరిగి మరలా దుర్గా ఘాట్‌కు వెళ్తుంది. ఈ క్రమంలో మూడుసార్లు భక్తుల దర్శనార్థం కృష్ణానదిలో తెప్పోత్సవం కొనసాగుతోంది. తర్వాతి కాలంలో కృష్ణానదిలో నీటి మట్టం తగ్గడం, మధ్యలో ఒక సంవత్సరం వరదలు రావడంతో గుంటూరు జిల్లా వైపు తెప్పోత్సవ కార్యక్రమాన్ని దేవదాయ శాఖాధికారులు నిలిపివేశారు.

మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రస్తుతం కృష్ణానదిలో పూర్తిస్థాయిలో నీటి మట్టం ఉండటంతో గుంటూరు జిల్లా వాసులు ప్రకాశం బ్యారేజీ 10వ కానా వరకు అమ్మవారు తెప్పోత్సవం నిర్వహించాలని కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజీపై నుంచి లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వేచి చూస్తారు. ఈసారైనా తెప్పోత్సవాన్ని చేసే అవకాశం జిల్లా వాసులకు దక్కుతుందో లేదో చూడాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top