పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పు

Cyclone Alert In Vizianagaram - Sakshi

తుఫాన్‌గా మారిన వాయుగుండం

దక్షిణ కోస్తావైపునకు కదలిక

17న జిల్లాలో వర్షాలు పడే అవకాశం

విజయనగరం గంటస్తంభం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఈ ప్రభావం వల్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్ల డించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉన్నామని చెబుతున్నా ఇందుకు సంబంధించి సరైన చర్యలులేకపోవడం చర్చనీయాంశమవుతోంది. బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్పపీడనం గురువారం వాయుగుండంగా మారిన విషయం విదితమే. వాతావరణ శాఖ చెప్పినట్లు శుక్రవారం నాటికి తుఫాన్‌గా మారింది. సాయంత్రానికి చెన్నైకు సుమారు 1035 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావం వల్ల దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన ఉందని తెలిపారు. భారీ నుంచి అతిభారీగా వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించారు. దక్షిణ కోస్తా నుంచి చెన్నై వైపు తుఫాన్‌ కదులుతుండడంతో ఉత్తర కోస్తాకు పెద్దగా ప్రభావం లేదు. దీంతో జిల్లాపై పెను ప్రభావం తప్పినట్లే.

కానీ 17వ తేదీ నాటికి జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర విపత్తుల శాఖ అధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్‌ వల్ల జిల్లాలో వాతావరణ మారింది. వేడి తగ్గి చలిగాలులు పెరిగాయి.

అధికారులు సిద్ధమేనా?: తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ఇందుకు సిద్ధమైనట్లు జిల్లా అధికారులు కూడా తెలిపారు. కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశామని, మత్స్యకా రులను అప్రమత్తం చేశామని తెలిపారు. అందుకు సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేశామన్నారు. కానీ జిల్లాలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మత్స్యకారులను అప్రమత్తం చేసిన వరకు చర్యలు తీసుకున్నా తుఫాన్‌పై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు. కలెక్టరేట్‌ నుంచి ప్రజలకు సరైన సమాచారం లభించడం లేదు. తుఫాన్‌ పరిస్థితి ఏమిటని అడిగినా కలెక్టరేట్‌తోపాటు, ఆర్డీవో కార్యాలయాల్లో సిబ్బంది నుంచి సరైన సమాచారం లేదు. కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబరు 08922 236947కు ఫోన్‌ చేస్తే తాత్కాలికంగా ఫోన్‌ పని చేయడం లేదని సమాధానం వస్తోంది. తుపాను తీవ్రత జిల్లాకు లేదన్న ధీమాయో... ఇంకేమైనా కారణమో కానీ జిల్లా యంత్రాంగం ఈ తుఫాన్‌ను అంత తీవ్రంగా పరిగణించడం లేదన్నది స్పష్టమవుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top