రాజధానికి భూములివ్వని రైతులపై ప్రభుత్వం కత్తిగట్టింది. భూ సమీకరణకు ముందుకు రాని రైతుల్ని లొంగదీసుకునేందుకు...
- ప్రత్తిపాటి ఫోన్‌తో వెలుగులోకి
 
	సాక్షి, హైదరాబాద్: రాజధానికి భూములివ్వని రైతులపై ప్రభుత్వం కత్తిగట్టింది. భూ సమీకరణకు ముందుకు రాని రైతుల్ని లొంగదీసుకునేందుకు గత నెలలో పంట భూముల్లో మం టల పేరిట అమాయకుల్ని పోలీసు స్టేషన్లకు రప్పించి హడలెత్తించింది. కాగితాలపై సంతకాలు పెట్టించుకుని ఠాణాల చుట్టూ తిప్పుతోంది. అది మరువక మునుపే ఏప్రిల్ నుంచి పంటలు వేయవద్దని హుకుం జారీ చేసింది. దీనిపై రైతుల నుంచి ప్రతిఘటనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
	
	ఈ నేపథ్యంలో భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న ప్రాంతాలకు ఎరువుల సరఫరా నిలిపివేసి.. చేలల్లో ఉన్న పంటల్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. అదేంటని అడిగితే తుళ్లూరు మండలానికి యూరియా సరఫరాను నిలిపివేశారని సమాధానం ఇస్తున్నారు. అక్కడ అరటి, జామ, మొక్కజొన్న తదితర పంటలను వేస్తుంటారు. వీటికి యూరియా అవసరం. ఈ పంట చేతికందిన తర్వాత మళ్లీ వేసే అవకాశం లేకుండా చేయడం , రైతుల  భూముల్ని ఖాళీ చేయించాలన్నది అధికారుల ఉద్దేశం.
	
	తుళ్లూరు, తాడికొండ మండలాలకు యూరియా సరఫరాను మంత్రులే నిలిపివేయించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారాన్ని ఇటీవల వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లినప్పుడు  విషయం బయటపడింది.  ప్రత్తిపాటి వ్యవసాయ శాఖ జేడీకి ఫోన్ చేసి దీనిపై ప్రశ్నించారు.ఆ అధికారి బదులిస్తూ.. ‘ఈ వ్యవహారం మీకు తెలియందా? మంత్రివర్గంలో వారు చెబితేనే అలా చేయాల్సివచ్చింది’ అని చెప్పడంతో  మంత్రి అవాక్కయ్యారు. దీంతో రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
