క్రికెట్టా..? పరీక్షలా? | cricket exam | Sakshi
Sakshi News home page

క్రికెట్టా..? పరీక్షలా?

Feb 19 2015 2:42 AM | Updated on Oct 20 2018 6:19 PM

నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ప్రపంచకప్ క్రికెట్ పోటీలు, మరోవైపు తమ జీవితాన్ని మలుపు తిప్పే ఫైనల్ పరీక్షలు.. ప్రస్తుతం పరిస్థితి క్రికెట్టా? పరీక్ష లా? అన్న సందిగ్ధత విద్యార్థుల్లో నెల కొంది.

నెల్లూరు (విద్య):నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ప్రపంచకప్ క్రికెట్ పోటీలు, మరోవైపు తమ జీవితాన్ని మలుపు తిప్పే ఫైనల్ పరీక్షలు.. ప్రస్తుతం పరిస్థితి క్రికెట్టా? పరీక్ష లా? అన్న సందిగ్ధత విద్యార్థుల్లో నెల కొంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్‌ను మతంగా, క్రీడాకారులను దైవంగా భావించే విద్యార్థుల దృష్టి పరీక్షలపై మళ్లించడం కష్టసాధ్యమే. గతంలోనైతే క్రికెట్ పోటీలను చూడకుండా టీవీ లను బంద్ చేసేవారు. ప్రస్తుతం పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.
 
 గత ఆదివారం పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ సందర్భంలో విద్యార్థుల్లోని క్రికెట్ ఫీవర్ ఏస్థాయిలో ఉందో తెలిసిపోయింది. విద్యార్థులు దాదాపుగా టీవీలకు అతుక్కుపోయారు. కుదరని వారు స్మార్‌‌టఫోన్లతో గడిపారు. మైదానాల్లో పరుగుల కోసం క్రీడాకారులు శ్రమపడుతుంటే, ఆ పరుగులను చూస్తూ పరీక్షల కోసం విద్యార్థులు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రెండు పరుగుల మధ్య సమన్వయం లోపిస్తే విద్యార్థుల భవిష్యత్ తలకిందులయ్యే పరిస్థితి నెలకొంటుంది. వరల్డ్‌కప్ పోటీల్లో మొత్తం 49 మ్యాచ్‌లను వీక్షిస్తూ కూర్చుంటే ఇంచుమించు పరీక్షల కాలం కాస్త ముగిసిపోయే ప్రమాదముంది.
 
 కనెక్షన్లు బంద్
 పరీక్షల కోసం కొంతమంది తల్లిదండ్రులు రెండు నెలల క్రితమే ఇళ్లలో టీవీలను, సెటాప్ బాక్సుల కనెక్షన్లను బంద్ చేశారు. టెన్‌‌త విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ విద్యాసంస్థల్లోనే చదువుకుంటారు కాబట్టి వారికి టీవీ చూసే అవకాశం ఉండదు. ఇంటికొచ్చే సమయానికి సెటాప్ బాక్సులు, టీవీ కనెక్షన్లు లేకపోవడంతో వారికి టీవీ చూసే అవకాశం తక్కువే. అయితే ఇంటర్ నుంచి ఆ పరిస్థితి మారిపోయింది. వీరు కాలేజీల్లో ఉండే సమయం కంటే బయటే ఎక్కువ గడుపుతారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో మినహా ఇంటర్, డిగ్రీ విద్యార్థులు బయటే అధిక సమయాన్ని గడిపేస్తున్నారు. వీరికి పెద్ద స్క్రీన్‌లతో స్పోర్ట్స్ లాంజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి తరుణంలో క్రికెట్ క్రీడే చదువులను డామినేట్ చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 నియంత్రణ కష్టమే..
 జిల్లావ్యాప్తంగా టెన్‌‌త పరీక్షలకు సుమారు 36 వేల మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 28,743 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 25,450 మంది హాజరుకానున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. విద్యార్థులను నియత్రించే శక్తి,  విద్యాసంస్థలకు లేదనేది వాస్తవం. ఈక్రమంలోనే సాంకేతిక పరి జ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చింది. అదే స్మార్ట్‌ఫోన్. వీరు ఎక్కడున్నా ఈ ఫోన్ల ద్వారా మ్యాచ్‌లను చూస్తారు. పరీక్షల సమయంలో క్రికెట్ వీరిని అధిగమిస్తుందనేది పలువురి వాదన. ఫోన్లను దూరం చే సే ధైర్యం తల్లిదండ్రులకు లేదనే చెప్పాలి.
 
 తేల్చుకోవాల్సిందే వారే:
 - కరిమద్దెల నరసింహారెడ్డి, వ్యక్తిత్వ వికాస నిపుణులు, విశ్రాంత రీడర్
 జీవితంలో క్రీడలు మంచివే. అయితే పరీక్షల సమయంలో టీవీలను చూడటం కాదు. మంచి ర్యాంకులతో టీవీల్లో కనపడేలా విద్యార్థులు మానసికంగా సిద్ధపడాలి. జీవితాన్ని మలుపుతిప్పే సమయాన్ని వృథా చేయకూడదు.
 
 చదువు ముఖ్యమే: ఎతిరాజ్, డీఎస్‌డీఓ
 క్రీడల్లో ప్రతిభ ఉన్నా చదువులు ఎంతో ముఖ్యం. క్రీడల్లో, చదువుల్లో రాణించకపోతే జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని అయ్యుండేవాడిని కాదు. క్రీడలకు కేటాయించే సమయం క్రీడలకు కేటాయించాలి. చదువులకు కేటాయించాల్సిన సమయం చదువులకు కేటాయించాలి.
 
 టీవీ తగ్గించాం: కే.సుశీల, గృహిణి
 పిల్లల చదువుల కోసం టీవీ చూడటం మేమే తగ్గించాం. గతంలో ఉదయం నిద్రలేచినప్పటి నుంచి టీవీ చూసే మా అబ్బా యి పరీక్షలు దగ్గరపడుతున్న కొద్ది టీవీకి దూరమయ్యాడు. చదువుల్లో రాణిస్తే జీవితంలో మళ్లీ,మళ్లీ ఆడుకోవచ్చు.
 
 నియంత్రణ కావాలి: బాలు, టీచర్
 విద్యార్థులు ఏకాగ్రత, నియంత్రణ శక్తిని పెంచుకోవాలి. కష్టపడి చదివినా చదువంతా క్రీడల కోసం వృథా చేయకూడదు. పాఠ్యాంశాలను మర్చిపోయే స్థితికి క్రీడలు అధిగమించకూడదు.  విద్యార్థులకు స్వయం నియంత్రణే శ్రీరామరక్ష.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement