వందల్లో బుకీలు.. వేలల్లో పంటర్లు

Cricket betting Gangs In ysr kadapa - Sakshi

బెట్టింగ్‌ ఊబిలో యువకులు

లబోదిబో మంటున్న కుటుంబ సభ్యులు

క్రికెట్‌ బుకీలుగా కొత్త ముఖాలు

నామమాత్రంగా పోలీసుల చర్యలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం: గాంధీరోడ్డులో బాగా పేరున్న కుటుంబం.. ఆ కుటుంబంలోని ఒక యువకుడు కొన్ని నెలల నుంచి ఇంట్లో తెలియకుండా క్రికెట్‌ పందేలు ఆడుతున్నాడు. రూ. వందల్లో ప్రారంభమైన క్రికెట్‌ బెట్టింగ్‌ రూ. లక్షలకు చేరుకుంది. కనీస పరిజ్ఞానం లేకుండానే క్రికెట్‌ జట్లపై రూ. లక్షల్లో పందేలు కాసేవాడు. ఇలా అతను సుమారు రూ. 40 లక్షలకు పైగా ప్రధాన బుకీకి బాకీ పడ్డాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. బయట తెలిస్తే పరువుపోతుందని క్రికెట్‌ బుకీకి డబ్బు కట్టారు.

మైదుకూరు రోడ్డులోని ఒక యువకుడు బంగారు దుకాణం నిర్వహించేవాడు. రెండేళ్లలోనే రూ. లక్షలు సంపాదించాడు. అయితే తోటి మిత్రుల మాటలు విని తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో క్రికెట్‌ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. సుమారు రూ.35 లక్షలు దాకా పోగొట్టుకున్నాడు. బుకీల నుంచి ఒత్తిళ్లు రావడంతో దిక్కు తోచని స్థితిలో భార్యను కొట్టి పుట్టింటికి పంపించాడు. డబ్బు తీసుకొని వస్తేనే కాపురానికి పిలుచుకుంటాను లేకుంటే వద్దని చెప్పాడు. ప్రొద్దుటూరులోని ఎక్కువ మంది బుకీలు చేసే పని ఇదే. డబ్బున్న యువకులను ఎంచుకొని బెట్టింగ్‌ ఊబిలోకి లాగుతున్నారు. పరువు పోతుం దనే భయంతో బంగారు నగలు విక్రయించి బాకీ కట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊళ్లోనూ క్రికెట్‌æ బెట్టింగ్‌ బాధితులు ఉన్నారు. గతంలో అప్పుల పాలై ఆత్మహత్యలకు ప్రయత్నించిన వారు, ఆత్మహత్య చేసుకున్నవారు కూడా ఉన్నారు.

సంపన్నులు, వ్యాపారుల పిల్లలే టార్గెట్‌..
క్రికెట్‌ ఆట ద్వారా సంపాదనకు అలవాటు పడిన బుకీలు అమాయకులపై ఆశల వల విసురుతున్నారు. ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన ప్రధాన బుకీలు జిల్లాలోని తమ బుకీల ద్వారా మండల కేంద్రాల్లో సబ్‌ బుకీలను, బాయ్‌లను నియమించుకొని క్రికెట్‌ పందేలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కొత్త వ్యక్తులను కూడా బెట్టింగ్‌ ఊబిలోకి లాగుతున్నారు. 20–20 మ్యాచుల్లో  పందేలు కాస్తే సునాయసంగా డబ్బు గెలుచుకోవచ్చని మభ్యపెడుతున్నారు. ఫలాన వ్యక్తి మా దగ్గర బెట్టింగ్‌ ఆడి రూ.లక్షలు గెలుచుకున్నారంటూ నమ్మ బలుకుతున్నారు. ధనికులు, వ్యాపార వర్గాలకు చెందిన పిల్లలపై బుకీలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రూ.లక్షలు బాకీ పడ్డాక బుకీలు వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

గ్రామాలకు ప్రాకిన బెట్టింగ్‌ జాడ్యం..
క్రికెట్‌ పందేల జాడ్యం గ్రామ స్థాయికి చేరింది. గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన క్రికెట్‌ పందేలు ఇప్పుడు గ్రామాల్లోకి గల్లీలకు ప్రాకింది. క్రికెట్‌ పందేలు అడే వారే కాకుండా బుకీలు కూడా గ్రామల్లో ఎక్కువగా ఉన్నారు. దువ్వూరు, ఎర్రగుంట్ల, చాపాడు, ఆర్టీపీపీల నుంచి పందేలు నిర్వహించడానికి ప్రొద్దుటూరుకు వస్తున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని ఖాదర్‌బాద్‌ గ్రామంలో పెద్ద సంఖ్యలో బుకీలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన ఒక ప్రధాన బుకీ ప్రస్తుతం తిరుపతిలో ఉంటూ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. సబ్‌ బుకీలను నియమించుకొని అతను ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరో ప్రధాన బుకీ హైదరాబాద్‌లో ఉంటూ బినామీలను నియమించుకొని కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతనిపై ప్రొద్దుటూరులోని పలు స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి. కాగా ఇటీవల పలువురు బుకీలుగా అవతారం ఎత్తినట్లు తెలిసింది.

కనిపించని పోలీసుల చర్యలు..
గతంలో క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సమయాల్లో ఆయా స్టేషన్ల పరిధిలో ఉన్న బుకీలను పోలీస్‌స్టేషన్లలో కూర్చోబెట్టేవారు. మ్యాచ్‌లు ముగిసే వరకు స్టేషన్‌లలోనే వారిని ఉంచుకునేవారు. ఈ చర్యల వల్ల కొంత మేర పందేలు అదుపులో ఉండేది. గతంలో పని చేసిన డీఎస్పీలు శ్రీనివాసులరెడ్డి, పూజితానీలం ఈ విధానం అనుసరించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రతి వీధిలోనూ క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. పట్టణంలో వందల సంఖ్యలో బుకీలు, వేలల్లో పంటర్లు (ఆడేవారు) ఉన్నారు. చాలా మంది ప్రధాన బుకీలు హైదరాబాద్, బెంగుళూరు, గోవా, విజయవాడ కేంద్రాలుగా చేసుకొని బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల ముగిసిన వెస్టిండీస్‌ – ఇండియా క్రికెట్‌ మ్యాచుల్లో బుకీలు బాగా లాభ పడినట్లు తెలుస్తోంది. బాగా లాభాలు రావడంతో పలువురు బుకీలు విదేశీ టూర్లకు కూడా వెళ్లినట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top