బీజేపీని తరిమికొట్టండి

CPM Leaders Comments On BJP Government Visakhapatnam - Sakshi

ద్వారకానగర్‌(విశాఖ దక్షిణ): ఏపీకి  విభజన హామీలన్నీ నెరవేర్చామని సుప్రీంకోర్టులో మోసపూరిత అఫిడివిట్‌ దాఖలు చేసిన బీజేపీని తరిమికొట్టాలని వామపక్ష పార్టీల నాయకులు శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ  రాష్ట్రానికి రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు అమలు, విశాఖ రైల్వేజోన్, రాష్ట్ర రాజధాని నిర్మాణానికినిధులు, పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని  ప్రజలతో ఓట్లు వేయించుకుని  బీజేపీ గడిచిన నాలుగేళ్లల్లో మోసం చేసిందన్నారు. హామీలన్నీ నెరవేర్చాం అని దుర్మారగపు అఫిడివిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
 
సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ  పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా ఇచ్చి అన్ని విధాలా అదుకుంటామని హామీ ఇచ్చి కోర్టును సైతం మోసం చేసిన బీజేపీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కడపలో ఉక్కు కర్మాగారం, అమరావతి నిర్మాణానికి నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు భుందేల్‌ఖండ్‌ తరహాలో నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ఇప్పుడు అబద్దాలు చెప్పి 5 కోట్లమంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.  కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ను వెంటనే వెనుక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

వామపక్షాల నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా ద్వారకానగర్, సెంట్రల్‌ పార్కు, జీవీఎంసీగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి పైడిరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు డి. మార్కండేయులు, జె.డి.నాయుడు,జి. రాంబాబు, ఆర్‌.శ్రీనివాసరావు, ఎస్‌.కె.రెహ్మన్, జి.వామనమూర్తి, ఏయూ విద్యార్థి సంఘం నాయకులు సమయం హేమంత్‌కుమార్, సనపల తిరుపతిరావు, ఏసీపీ పార్టీ అధ్యక్షుడు కె. రామానాయుడు, ఎంసీపీఐ నాయకులు కె.శంకరావు, సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వీ.కుమార్, కృష్ణారావు, పి. చంద్రశేఖర్, వై.నందన్న పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top