దంపతుల మృతదేహాల వెలికితీత

Couple Murdered At Ongole Police Found Dead Bodies

ఓ రేకుల షెడ్డులో పూడ్చిన మృతదేహాలు

ఆపై నాపరాళ్లు పరిచి ఫ్లోరింగ్‌ చేసిన నిందితులు

ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు కారం చల్లిన కిరాతకులు

 సంఘటన స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం

ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతులను చంపిన తీరు హృదయ విదారకంగా ఉంది. కిరాతకులు వారిని అత్యంత పాశవికంగా కడతేర్చారు. రేకుల షెడ్డులో చిన్నపాటి గుంత తీసి మృతదేహాలను అందులో కుక్కారు. ఎవరూ కనిపెట్టకుండా ఉండేందుకు బండలతో ఫ్లోరింగ్‌ చేశారు. ఆనవాళ్లు చెరిపేందుకు గది మొత్తం కారం చల్లారు. ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఒంగోలు క్రైం: నగరానికి చెందిన పాత ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతుల మృతదేహాలను గురువారం పోలీసులు వెలికితీశారు. నిందితులు పూడ్చిన మృతదేహాలను డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, రిమ్స్‌ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. దంపతులను అత్యంత కిరాతకంగా హతమార్చిన హంతకులు అంతే కిరాతకంగా నాలుగు అడుగుల గుంతలో పాతి పెట్టారు. మృతదేహాలను గోనె సంచిలో కుక్కినట్లు గోతిలో కుక్కారు. ఇదంతా చేసింది ఏ పొలాల్లోనో.. చెట్ల పొదల్లోనో కాదు.. నిర్మానుష్య ప్రాంతం అంతకంటే కాదు.. పరిశ్రమలు, నివాస ప్రాంతాల నడుమ.

ఒక రేకుల షెడ్డులో. హత్యలకు పాల్పడింది నగరంలోని శివప్రసాద్‌ కాలనీకి చెందిన లక్కే శ్రీనివాసులుగా గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించటంతో హత్యకు సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు లక్కే శ్రీనివాసులు, అతడికి సహకరించిన అతని స్నేహితురాలు ఎనిమిరెడ్డి సుబ్బులు, అతని వద్ద లారీ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కొత్తడొంకలోనే నివాసం ఉంటున్న మరాఠీ సింధే కుమార్‌లను ఒంగోలు డీఎస్పీ జి.శ్రీనివాసరావు, ఒన్‌టౌన్‌ సీఐ ఎండీ ఫిరోజ్‌ తోపాటు డీఎస్పీ క్రైం ప్రత్యేక టీమ్‌లు స్థానిక ఎంఎస్‌ నగర్‌లోని కొత్తడొంకలో ఉన్న సంఘటన స్థలానికి మధ్యాహ్నం 2.45 గంటలకు తీసుకొచ్చారు. మృతదేహాలను ఎక్కడ పూడ్చి పెట్టింది నిందితుల ద్వారానే తెలుసుకున్నారు.

ఫ్లోరింగ్‌ తవ్వించి..
ఒంగోలు తహసీల్దార్‌ కె.చిరంజీవితో పాటు రిమ్స్‌ ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌ సమక్షంలో మృతదేహాలు ఉన్న ప్రాంతంలో తవ్వించారు. నాపరాళ్లు తొలగించి కొంచెం మట్టి తీయగానే దుర్గంధం వెదజల్లింది. మృతదేహాలను వేర్వేరు దిశల్లో కుక్కి ఉన్నాయి. దాదాపు 8 రోజులు కావడంతో మృతదేహాలు పూర్తిగా ఉబ్బి ఉన్నాయి. తహసీల్దార్‌ చిరంజీవి సమక్షంలో మృతదేహాలకు పోలీసులు పంచనామా నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌ అక్కడే పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో మృతదేహాలపై గాయాలు గుర్తించారు. శ్రీనివాసరావు గొంతులో ఒక కత్తి పోటు, ఛాతిపై మరో కత్తి పోటు ఉన్నాయి. ప్రమీలారాణి గొంతులో ఒక కత్తి పోటు, గొంతు కింద, ఛాతిపై మరో రెండు కత్తిపోట్లు ఉన్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మృతురాలి తండ్రి బాపనపల్లి వెంకటేశ్వర్లుకు అప్పగించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top