అంతరిక్ష యవనికపై జాబిల్లికి జైత్రయాత్ర!

Countdown Starts For Chandrayaan 2 Mission - Sakshi

చంద్రయాన్‌–2కు మొదలైన కౌంట్‌డౌన్‌

మధ్యాహ్నం 2.43గంటలకు

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ప్రయోగం..

ఇస్రో చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రయోగం

శ్రీహరికోట (సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43గంటలకు 3,850 కిలోల జీఎస్‌ ఎల్‌వీ– మార్క్‌–3 ఎం1 వాహక నౌకను ప్రయోగించడానికి సర్వం సిద్ధం చేశారు. పదేళ్లపాటు ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి రూపొందించిన ఈ చంద్ర యాన్‌–2 మిషన్‌కు ఆదివారం సా.6.43గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఏ రాజ రాజన్‌ ఆధ్వర్యంలో ఆదివారం లాంచ్‌ రిహార్సల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ల్యాబ్‌ మీటింగ్‌లో సా.6.43  గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించాలని నిర్ణయించారు. 20 గంటల కౌంట్‌డౌన్‌ సమయంలో భాగంగా ఆదివారం రాత్రికి మూడో దశలోని క్రయోజనిక్‌ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు.

అలాగే, సోమవారం వేకువజామున రాకెట్‌కు రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తిచేయడానికి పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ద్రవ ఇంధనం నింపిన అనంతరం రాకెట్‌కు పలు పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత ప్రయోగానికి మరికొన్ని గంటల ముందు రాకెట్‌లో హీలియం గ్యాస్‌ నింపడానికి, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్‌ వ్యవస్థలను అప్రమత్తం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రయాన్‌–2 ప్రయోగం ఇస్రో చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోయే ప్రయోగంగా చెప్పవచ్చు. ఇంతపెద్ద రాకెట్‌ను, ఇంతపెద్ద ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ప్రయోగాన్ని ఇస్రో చరిత్రలో భారీ ప్రయోగంగా అభివర్ణిస్తున్నారు.

నేటి మ.2.43 గంటలకు వినువీధిలోకి..
కాగా, 20 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం మ.2.43 గంటలకు సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గ్రహాంతర ప్రయోగాల్లో ఈ ప్రయోగం మూడోది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి చేస్తున్న రెండో ప్రయోగం. షార్‌ నుంచి 75వ ప్రయోగం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ముందుగా అనుకున్నట్లుగా ఈనెల 15వ తేదీన జరగాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top