సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ఘట్టాన్ని సాధించింది. ఆదివారం సాయంత్రం 5:26 గంటలకు ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి LVM3–M5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా CMS–03 సమాచార ఉపగ్రహాన్ని 16.09 నిమిషాల్లో జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) లోకి ప్రవేశపెట్టారు.
ప్రయోగం ఉద్దేశ్యం
ఈ మిషన్ ప్రధానంగా భారతదేశానికి భద్రమైన, అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థను అందించేందుకు రూపొందించబడింది. దేశ రక్షణ వ్యవస్థకు మద్దతు,సముద్ర పర్యవేక్షణ, వ్యూహాత్మక సమాచార మార్పిడికి కీలకంగా వ్యవహరించనుంది.

ప్రయోగం ఇలా..
43.5 మీటర్లు పొడవు కలిగిన ఎల్‌వీఎం–3 రాకెట్ ప్రయోగం ప్రారంభ సమయంలో 642 టన్నుల బరువుతో నింగికి పయనమైంది. ఎల్‌ఎం3–ఎం5 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ సమయం ముగిసే సరికి రాకెట్‌కు రెండువైపులా వున్న ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లు మండి 642 టన్నుల బరువు కలిగిన రాకెట్‌ను భూమి నుంచి నింగివైపునకు తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగింది.
అంటే 400 టన్నుల ఘన ఇంధనాన్ని మండించి 105 సెకన్లలో మొదటి దశను పూర్తి చేశారు. 198.86 సెకన్లకు రాకెట్ శిఖరభాగాన అమర్చిన శాటిలైట్‌కు రెండు వైపులా వున్న షీట్‌ల్డ్‌లు విడిపోయాయి. ఆ తరువాత ఎల్–110 దశతో అంటే 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని 106.94 సెకన్లకు మండించి 304.70 సెకన్లకు రెండోదశను పూర్తి చేశారు.
అనంతరం 25 టన్నుల క్రయోజనిక్ దశను 307.10 సెకన్లకు మండించి 950.54 సెకన్లకు మూడోదశను పూర్తి చేశారు. ఈ దశలోనే 965.94 సెకన్లకు (16.09 నిమిషాల్లో) సీఎంఎస్–03 ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి అడుగుపెట్టింది


