సీఎంఎస్–03 కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగానికి సర్వంసిద్ధం
బెంగళూరు: అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే ఇస్రో వారి ఎల్‌వీఎం–3 రాకెట్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని ప్రయోగవేదిక మీదకు సీఎంఎస్–03 ఉపగ్రహాన్ని అమర్చిన ఎల్‌వీఎం–3 రాకెట్‌ను ఆదివారం తరలించారు. నవంబర్ రెండో తేదీన ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నామని ఇస్రో ఆదివారం వెల్లడించింది.
భారత్‌సహా విశాలమైన సముద్రప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలు అందించే లక్ష్యంతో మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ సాయంతో కక్షలో ప్రవేశపెట్టాలని నిర్ణయించడం తెల్సిందే. ఈ ఉపగ్రహం బరువు ఏకంగా 4,400 కేజీలు. భారత గడ్డ మీద నుంచి భూస్థిర కక్షలోకి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. గతంలో చంద్రయాన్–3 మిషన్ కార్యక్రమం కోసం ఎల్‌వీఎం–3 రాకెట్‌ను వినియోగించారు. ఈ రాకెట్‌ను ఇప్పటిదాకా నాలుగుసార్లు ఉపయోగించారు. పౌర, వ్యూహాత్మక, నావికా సేవలను సీఎంఎస్–03 ఉపగ్రహం అందివ్వనుంది.


