ఎలుకల నష్టం అపారం | Sakshi
Sakshi News home page

ఎలుకల నష్టం అపారం

Published Fri, Apr 27 2018 1:41 PM

Councelling To Farmers On Rats In coco Garden - Sakshi

అమలాపురం: కొబ్బరి, కోకో తోటల్లో ఎలుకలు చేసే నష్టం అంతా ఇంతా కాదని, వీటిని సకాలంలో గుర్తించి తగు చర్యలు తీసుకోకుంటే రైతులు భారీగా నష్టపోతారని నేషనల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ బి.నరేష్, డాక్టర్‌ పి.శక్తివేల్‌ తెలిపారు. అమలాపురం అంబేద్కర్‌ కమ్యూనిటీ భవనంలో కొబ్బరి, కోకో తోటల్లో ఎలుకలు నివారణ, బిందు సేద్యంపై ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఏడీహెచ్‌ సిహెచ్‌.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ దేశం మొత్తం మీద 104 ఎలుక జాతులు ఉన్నాయని, వీటిలో 14 జాతులు వ్యవసాయ, ఉద్యాన పంటలను నష్టపురుస్తాయని, దీనిలో నాలుగు జాతులు అత్యంత తీవ్ర నష్టం చేస్తాయని వారు తెలిపారు. ఎలుకల పళ్లు రోజుకు 0.04ఎంఎం
ఎదుగుతాయని, దాని వలన వాటిని నియంత్రించడానికి ఎదురు వచ్చినవాటిని కొరికిపడేస్తాయని తెలిపారు. వరి రైతులు 96:2:2 పాళ్లలో నూకలు/ ఏదైనా ఎర:నూనె:విషం (బ్రోమోడయోలిన్‌) కలిపి బొరియల్లో వేయాలన్నారు. కొబ్బరి  తోటల్లో సైతం ఇదే విధానంలో మందును తయారు చేసి చెట్టు మొవ్వు వద్ద ఉంచాలన్నారు. కోకోలో విషం కలిపిన పొట్లాలను ఏదైనా గొట్టం లేదా వెదురు బొంగులలో ఉంచడం వల్ల ఇతర జంతువులకు హాని తప్పించే అవకాశముందని శాస్త్రవేత్తలు నరేష్, శక్తివేల్‌ తెలిపారు.

ఏపీ ఎంఐపీ పీడీ ఎస్‌.రామమోహన్‌ మాట్లాడుతూ చుట్టూ గోదావరి ఉన్నంత మాత్రాన బిందు సేద్యం (డ్రిప్‌ ఇరిగేషన్‌) అవసరం లేదన్నట్టు రైతులు అనుకోవడం మంచిది కాదని, ఇక్కడ తప్పనిసరిగా బిందు సేద్యాన్ని వినియోగించాల్సి ఉందన్నారు. బిందు సేద్యం ప్రోత్సాహానికి ప్రభుత్వం భారీగా రాయితీలందిస్తోందన్నారు. ఐదు ఎకరాలలోపు ఓసీ, బీసీ రైతులకు 90 శాతం, 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు 70 శాతం, 10 ఎకరాలు పైబడి ఉన్న రైతులకు 50 శాతం, ఎస్‌సీ, ఎస్టీ రైతులకు ఐదు ఎకరాల లోపు 100 శాతం, 5 నుంచి 10 ఎకరాల లోపు రైతులకు 70 శాతం, 10 ఎకరాల పైబడి ఉన్న రైతులకు 50 శాతం రాయితీ అందిస్తోందని ఆయన వివరించారు. తుంపర్లకు 2 అంగుళాల నుంచి 4 అంగులాల పైపులు వరకు 50 శాతం రాయితీ అందిస్తామన్నారు. బిందు సేద్యం వల్ల ఎరువులు ఆదా చేయడంతో పాటు దిగుబడి 10 శాతం వరకు పెరుగుతుందని ఆయన వివరించారు. ఉద్యానశాఖ ఏవోలు, ఎంపీఈవోలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement