'కాయ'కల్ప తరువు | World Coconut Day on September 2nd | Sakshi
Sakshi News home page

'కాయ'కల్ప తరువు

Sep 3 2025 4:50 AM | Updated on Sep 3 2025 4:51 AM

World Coconut Day on September 2nd

ఆరోగ్య ప్రదాయిని.. కొబ్బరి 

నీటి నుంచి ఆయిల్‌ వరకు ప్రతిదీ ఔషధమే.. 

నీరు, ముక్క, పాలు, వెనిగర్‌ ఇలా ఎన్నెన్నో! 

అన్నింటా ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు 

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో సాగు 

సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం 

కొబ్బరి చెట్టును చూస్తే గోదారమ్మ ఒడిలో ఒదిగిన అందాల బిడ్డలా కనిపిస్తోంది. ప్రకృతి అందాల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అదనపు అందాలు అద్దే కొబ్బరి చెట్టు చూసి ముచ్చట పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తోటల్లో పంటగానే కాదు వరిచేలు.. చెరువులు.. రోడ్లు.. కాలువలు.. నదీపాయల వెంబడి.. ఇళ్ల చుట్టూ కనిపించే కొబ్బరి చెట్టు గోదావరి వాసుల నుదుటిన ప్రగతి తిలకం దిద్దుతూ ఇక్కడ వారి జీవనంలో పెనవేసుకుపోయింది. కన్న కొడుకుగా పిలుచుకుంటారంటే.. వారి జీవనంలో కొబ్బరి ఎంత ప్రాముఖ్యమో అవగతమవుతుంది.  

సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి ఒక్క ఉమ్మడి తూర్పులోనే 1.30 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే కొబ్బరి ఔషధాల గని. కొబ్బరి ఉత్పత్తుల ద్వారా రైతులు, వ్యాపారులు, కారి్మకులు ఉపాధి పొందుతుంటే.. ఆయా ఉత్పత్తుల ద్వారా సామాన్యులు సైతం మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు. లక్షలాది మంది ప్రజలకు ఔషధాలను అందిస్తూ కొబ్బరి ఆరోగ్య వర ప్రదాయినిగా పేరొందింది. సెప్టెంబర్‌ రెండున ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.  

కొబ్బరి పాలతో వర్జిన్‌ ఆయిల్‌ 
కొబ్బరి పాల నుంచి  తయారు చేసే కొబ్బరి వర్జిన్‌ నూనె చర్మాన్ని తేమగా ఉంచడం, జుట్టుకు పోషణ ఇవ్వడం, బరువు తగ్గడంలో సాయపడుతోంది. మెదడు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు, యాంటీ మైక్రోబయల్‌ గుణాలను కలిగి ఉంటుంది. తెల్ల రక్త కణాలను వృద్ధి చేస్తోంది. హెచ్‌ఐవీ రోగులకు ఇది చేసినంత మేలు మందులు కూడా చేయవు. శరీరాన్ని మృదువుగా ఉంచుతోంది. ఇది మంచి సౌందర్య పోషణ.  

మధుమేహ రోగులకు కొబ్బరి కల్పరస 
కొబ్బరి జ్యూస్‌ (కల్లు–కల్పరసా) ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. ఫెర్మంటేషన్‌ ఆవకుండా ఉత్పత్తి చేసే కొబ్బరి జ్యూస్‌ (నీరా) నేరుగా తాగినా, దీనిని నుంచి ఉత్పత్తి చేసే పంచదార, బెల్లం, తేనెను ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. ఇందులో గైసమిక్‌ ఇండెక్స్‌ 25 శాతం మాత్రమే. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని ఆహారంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

అమ్మపాలను తలపించే కొబ్బరి పాలు 
కొబ్బరి ముక్క నుంచి తీసే పచ్చి పాలలో విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, బి కాంప్లెక్స్‌ (బి1,బి3,బి5,బి6), కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. లారిక్‌ యాసిడ్‌ (ఓ రకమైన కొవ్వు ఆమ్లం) కూడా ఉంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఎముకలను బలపరుస్తాయి, కొలె్రస్టాల్‌ను తగ్గిస్తాయి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బరి పాలు చర్మానికి, జుట్టుకు కూడా ప్రయోజనకరం. 

శక్తినిచ్చే పచ్చి కొబ్బరి 
కొబ్బరి ముక్కల (పచ్చి లేదా ఎండు)లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ముక్కలను ఆహారంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి శక్తి అందుతుంది. బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది.  

కొబ్బరి ముక్క గుడ్డుతో సమానంగా పోషకాలు 
కొబ్బరి పువ్వు (గుడ్డు)లో కోడి గుడ్డుతో సమానంగా పోషకాలున్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల అలసట, నీరసం తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ లక్షణాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, కొబ్బరి పువ్వులో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలె్రస్టాల్‌ స్థాయిలను తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  

వంటకు కొబ్బరి నూనె శ్రేష్ఠం 
కొబ్బరి నూనె ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శక్తి పెరిగి, చర్మానికి తేమ అందుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఉండే మధ్యస్థ గొలుసు కొవ్వు ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. హార్మోన్ల స్థాయిలను స్థిరంగా ఉంచి, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనెను తలకు పట్టించి.. మర్దన చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.  

దివ్యౌషధం.. కొబ్బరి బొండాం 
కొబ్బరి బొండాం ఓ దివ్యౌషధం. ప్రృకతి సిద్ధమైన సెలైన్‌. దీనిలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, విటమిన్‌ సి, బి పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన హైడ్రేట్లు, ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 95 శాతం నీరుంటుంది. ఇది శరీరాన్ని తేమగా ఉంచడానికి దోహదపడుతుంది. శరీరంలో సులభంగా జీర్ణమయ్యే చక్కెర రూపంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement