
కొబ్బరి.. మన జీవితంలో ఒక భాగంగా కలిసిపోయింది. శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు మొదలుకొని, అనారోగ్యం నుంచి ఉపశమనం పొందేవరకూ కొబ్బరికి ఉన్న ప్రాధాన్యత కొలవలేనిది. చిరు తిళ్లు, ఫాస్ట్ ఫుడ్, ఇన్ స్టంట్ ఫుడ్‌లతో అనారోగ్యాల బారిన పడుతున్న మనకు కొబ్బరి స్వీట్లు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా మారాయి. కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలను పలు రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలున్న కొబ్బరిని విశేషంగా గుర్తించేందుకు ఒక రోజు ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఎప్పుడు ఎలా మొదలైందనే విషయానికొస్తే..
అన్నీ ఉపయోగపడేవే..
కొబ్బరి చెట్టు కాండం, కాయలు,ఆకులు, కొబ్బరి నీళ్లు, పీచు, కొబ్బరి పాలు,నూనె.. ఇన్ని రకాల ప్రయోజనాలున్నందున ఈ చెట్టు మనిషికి భూలోక కల్పవృక్షంగా మారింది. ప్రపంచ కొబ్బరి దినోత్సవ ప్రధాన లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరికి ఉన్న ప్రాముఖ్యత గుర్తించడం. అందరికీ అవగాహన కల్పించడం. ఆసియా, పసిఫిక్ దేశాలు ప్రపంచంలో అత్యధికంగా కొబ్బరిని పండిస్తున్నాయి. 2009 లో తొలిసారిగా ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరిగింది. ఇండోనేషియాలోని యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా ఈ దినోత్సవానికి శ్రీకారం చుట్టుంది.
కొబ్బరి ఉత్పత్తిలో టాప్‌లో భారత్
ప్రపంచంలో కొబ్బరి చెట్టు లేని దేశం అంటూ ఉండదు. అన్ని కాలాల్లోనూ పంట ఇస్తుంది. భారత్ లో కొబ్బరి చెట్టుకు ఉండే ప్రత్యేకత అమోఘమైనది. ప్రపంచ దేశాల్లో కొబ్బరి ఉత్పాదకత కలిగిన దేశాల్లో భారతదేశం టాప్‌లో ఉంది. కొబ్బరి డెవలప్ మెంట్ బోర్డు..కేరళ, తమిళనాడు, కర్నాటక, గోవా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలలో కొబ్బరి దినోత్సవం రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. కొబ్బరి ఉత్పత్తిని పెంచేందుకు సంబంధించి అవగాహన కోసం నిపుణుల సారధ్యంలో సదస్సులు నిర్వహిస్తుంటుంది.
అనేక ప్రయోజనాలు
కొబ్బరి పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా పేదరిక నిర్మూలనలో కొబ్బరి పాత్రను సూచించడానికి ప్రపంచ కొబ్బరి దినోత్సవ ప్రయత్నిస్తుంది. ఖనిజాలు, ప్రోటీన్లు,బి-విటమిన్ల సమ్మేళనమైన కొబ్బరి మన ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మానికి తేమను సమకూరుస్తుంది. శీతాకాలంలో శరీరం పొడిబారిపోకుండా కొబ్బరి నూనెను రాసుకుంటారు. కొబ్బరి నీరు రిఫ్రెష్ పానీయం అని చెప్పకతప్పదు.మూత్రపిండాల్లో రాళ్లను కొబ్బరి నీరు ఇట్టే కరిగిస్తుంది. అలాగే తక్షణ శక్తినివ్వటంలో కొబ్బరి నీళ్లను మించిన ఔషధ లేదని చెబుతారు. కొబ్బరి, కొబ్బరి నీళ్లు మనలోని శక్తి స్థాయిలను పెంచుతాయి.