
చీకటి.. ఢిల్లీ నగరానికి బాగా అలవాటైపోయింది. ఎన్ని చర్యలు చేపట్టినా ఢిల్లీలో ‘చీకటి’ని తగ్గించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. దీనికి కారణం గాలి కాలుష్య తీవ్రత అదుపులో లేకపోవడమే. దాంతో మరొకసారి ఢిల్లీని చిమ్మ చీకటి అల్లేసింది. దీపాల పండుగ దీపావళి రాకముందే దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి దిజారిపోవడంలో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) వ్యాప్తంగా వాయు కాలుష్యం 'చాలా ప్రమాదకరం' కేటగిరీకి చేరింది. ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాయు కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 301 నుంచి 400 మధ్య ఉన్నప్పుడు దానిని ‘చాలా ప్రమాదకరం’గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 మార్కును దాటేసింది. ఘజియాబాద్‌లోని లోనిలో అత్యధికంగా 339గా నమోదయ్యింది. నోయిడా సెక్టార్ 125లో 358కి చేరింది. అలాగే ఆనంద్ విహార్ (335), వజీర్‌పూర్ (337) ప్రాంతాల్లో కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.
ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) తొలి దశను అమలులోకి తెచ్చారు. ఈ దశలో నిర్మాణ, కూల్చివేతల పనులను నిలిపివేయాల్సి ఉంటుంది. అలాగే డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం లాంటి ఆంక్షలు విధించారు. కాలుష్యం మరింత పెరిగిన పక్షంలో రెండో దశ కింద అధికారులు మరిన్ని కఠినమైన చర్యలను చేపట్టనున్నారు.
#WATCH | Delhi | The Air Quality Index (AQI) around Akshardham was recorded at 369 this morning, in the 'Very Poor' category in Delhi as per the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/aPVJ2SZ9ID
— ANI (@ANI) October 17, 2025
ఓజోన్, పీఎం10 రేణువుల సాంద్రత వాతావరణంలో పెరగడమే ఈ కాలుష్యానికి ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు. గాలి వేగం తక్కువగా ఉండటానికి తోడు ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోతున్నాయని వారు చెబుతున్నారు. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడం వల్ల చిన్నారులు, వృద్ధులతో పాటు శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్రమైన ఆనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదని, ఒకవేళ తప్పని సరిగా వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడాలని చెబుతున్నారు.