
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)నిర్వహించిన మార్చ్‌లో పాల్గొన్న అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. కర్నాటకలోని రాయ్‌చూర్ జిల్లాలోగల సిర్వార్ తాలూకాలో ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న కేపీ ప్రవీణ్ కుమార్‌ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ (ఆర్‌డీపీఆర్) విభాగం సస్పెండ్ చేసింది. ఆయన లింగ్‌సుగూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది రూట్ మార్చ్‌లో ఆ సంస్థ యూనిఫారం ధరించి పాల్గొన్నారు. ఫలితంగా ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఐఏఎస్ అధికారిణి అరుంధతి చంద్రశేఖర్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులో కేపీ ప్రవీణ్ కుమార్.. కర్ణాటక సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమాలు, 2021లోని మూడవ నియమం ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు రాజకీయ తటస్థత, క్రమశిక్షణ, తగిన ప్రవర్తనను కలిగివుండాలి. కుమార్‌పై డిపార్ట్‌మెంటల్ విచారణ జరిగే వరకు ఆయనకు జీవనాధార భత్యం అందిస్తారు.
కర్ణాటక ప్రభుత్వం- ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ క్రమశిక్షణా చర్య తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ సంస్థలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని,సంస్థతో సంబంధం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐటీ, ఆడీపీఆర్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల ముఖ్యమంత్రిని కోరారు. కేపీ ప్రవీణ్ కుమార్‌పై సస్పెన్షన్ వేటువేయడాన్ని మంత్రి ఖర్గే సమర్థించారు. ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. కాగా బీజేపీ ఈ సస్పెన్షన్‌ను ఖండించింది. ఇది రాజకీయ ప్రేరేపితమని, హిందూ సంస్థలపై కాంగ్రెస్ అసహనాన్ని కలిగి ఉందని ఆరోపించింది.