ముఖ్యమంత్రి ముచ్చటకు మూడు కోట్లు!

The Cost Of The Funding For The Chief Minister Is Rs 3 Crore. - Sakshi

ముఖ్యమంత్రి వస్తారని ముమ్మరంగా నిధుల ఖర్చు

తీరా ఆయన పర్యటన రద్దయినట్టు అధికారిక ప్రకటన

ఇప్పటివరకూ చేసిన ఖర్చుపై సర్వత్రా విమర్శల వెల్లువ

ఈ నెల 25వ తేదీన ఉండవచ్చని ప్రకటించిన మంత్రి గంటా

అధికారుల్లో నిరాశా నిస్పృహలు..

మరో పదిరోజులపాటు అవస్థలు తప్పవని విమర్శలు

నగరంలోని కార్యాలయాల గోడలకు రంగులు వేశారు. చక్కనైన డిజైన్లు చెక్కించారు. గోతులు పడిన రోడ్లపై క్రషర్‌బుగ్గి కుమ్మరించారు. ఎక్కడికక్కడే మొక్కలు నాటేసి... నానా హంగామా చేశారు. అవసరం లేకపోయినా.. రోడ్డుపక్క చెట్లకు రకరకాల రంగులు వేశారు. నగరంలో పాలకులు... అధికారులు ఒకటే హడావుడి చేశారు. ఇక సాలూరులో అయితే హెలిప్యాడ్‌ నిర్మించారు.

వారం రోజులుగా రోజూ ఎవరో ఓ అధికారి వెళ్లి అక్కడి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇదంతా ఎందుకో తెలుసా... రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాట్లు. ఆయన మెప్పుకోసం పాలకులు చేసిన ఖర్చు చూస్తే మూడు కోట్లంట. ఇప్పుడు ఆయన రాక రద్దయింది. ఇంతవరకు చేసిన ఖర్చుపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విజయనగరం గంటస్తంభం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 14వ తేదీన జిల్లాలో పర్యటిస్తారని తొలుత వర్తమానం అందింది. నగరంలో అధికారులతో సమీక్ష... నగర దర్శిని ఉంటాయని చెప్పుకొచ్చారు. సాలూరు మండలం గదబబొడ్డవలసలో గ్రామ దర్శిని, అనంతరం సాలూరు బహిరంగ సభలో పాల్గొంటారని,  విజయనగరంలో రాత్రికి పలు కార్యక్రమాలు ఉం టాయని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సమాచారం ఇచ్చాయి.

ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. అధి కారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతా చర్యలు తీ సుకున్నారు. అయితే మరో 24గంటల్లో పర్యటన ఉందనుకున్న సమయంలో సోమవారం మధ్యాహ్నం పర్యటన రద్దయినట్లు అధికా రులకు సమాచారం వచ్చింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల పర్యటన రద్దయింద ని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు సాలూరులో ప్రకటించారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా అధి కారికంగా సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని డీఆర్వో జె.వెంకటరావు అధికారికంగా ధ్రువీకరించారు. అయితే ఈ నెల 25వ తేదీన సీఎం పర్యటన మళ్లీ ఉంటుందని మంత్రి గంటా వెల్లడించా రు. అంటే ప్రస్తుతానికి రద్దయినా మరో సారి ఉండడం ఖాయంగా తేలింది.

ఇప్పటికే ఈ పనులకోసం దాదాపు రూ.మూడుకోట్ల వరకూ ఖర్చయినట్టు తెలుస్తోంది. మరి ఆ నిధులు శాశ్వత పనులకు వినియోగించి ఉంటే సరేగానీ... తాత్కాలిక పనులకోసం వెచ్చిస్తే అవన్నీ వృథాయేననడంలో సందేహం లేదు.

యంత్రాంగం కష్టం వృథా

ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతె జిల్లాలో అధికారులు, సిబ్బంది శ్రమ పూర్తిగా వృథా అయినట్టయింది. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనం కంటే ఎక్కువగా ఒత్తిడి అనుభవించేది అధికారయంత్రాంగమే. అధికారిక కార్యక్రమం అయితే అన్ని ఏర్పాట్లు అధికారులు చూసుకోవాల్సిందే. మంగళవారం పర్యటనకు కూడా అదే జరిగింది.

ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి పర్యటన దాదాపు పదిరో జులు క్రితమే ఖరారైంది. ఈ నెల ఒకటో తేది నుంచి కలెక్టర్‌ హరి జవహర్‌లాల్, జేసీ వెంకటరమణారెడ్డి, ఐటీడీఏ పీవో లక్ష్మీశతోపాటు దాదాపు అందరు అధికారులు అదే పనిలో ఉన్నారు. సాధారణ పాలన పక్కన పెట్టి గ్రామదర్శిని జరిగే గదబ బొడ్డవలసలో పర్యటించి అక్కడ ఏర్పాట్లు చేశారు.

అధికారులు, సిబ్బంది గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్నరోడ్లు, కాలువలు శుభ్రం చేశారు. పథకాలు అందడంలో లోపాలుంటే ఎక్కడ తమకు ఇబ్బంది కలుగుతుందోనని ఇంటింటికి తిరిగి పథకాలు అందుతున్నాయా? లేదా? అన్నది పరిశీలించారు. ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడాలో తర్ఫీ దు ఇచ్చారు. సాలూరులో జరిగే బహిరంగ సభకు వేదిక, ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు.

జనాలకు తీసుకొచ్చేందుకు బస్సులు ఏర్పాటు చేసి సొమ్ము కూడా చెల్లించారు. ముఖ్యంగా మహిళలను పెద్ద ఎత్తున రప్పించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. విజయనగరం పట్టణంలో పర్యటిస్తారం టే పట్టణంలో అనేక పనులు చేశారు. కాలువలు హడావుడిగా శుభ్రం చేశారు. రోడ్లు బాగు చేసి, వీధి లైట్లు వేసి, గోడలు, డివైడర్లకు రంగులు పూసి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.

ఇక ఆయన బస చేసే జెడ్పీ గెస్ట్‌హౌస్‌ కట్టి ఎన్నాళ్లో కాకపోయినా, పెయిటింగులు శుభ్రంగా ఉన్నా మరోసారి రంగులు వేశారు. ఎక్కడ సమావేశం పెడతారో తెలియక కలెక్టరేట్‌ ఆడిటోరియం, డీఆర్‌డీఏ కాన్ఫరెన్సు హాల్‌ సుందరంగా చేశారు. ఇక వాహనాలు సమకూర్చడం, భోజనాలు సిద్ధం చేయడం అన్నీ జరిగిపోయాయి. అన్నింటికి మిం చి ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు అధికా రులే ఎప్పుడూ లేనివిధంగా భారీ ప్లేక్సీలు కూడా ఏర్పాటు చేశారు. 

మరో పదిరోజులు హైరానాయే..

ఇక ముఖ్యమంత్రి పర్యటన పూర్తిగా రద్దయిందంటే పోనీలే అని సరిపుచ్చుకునేవారు. కానీ మరోరోజు ఉంటుందనడంతో శాశ్వతంగా చేసిన పనులకు ఇబ్బంది లేకపోయినా తాత్కాలిక పనుల కోసం మళ్లీ ప్రయాస తప్పదని వాపోతున్నారు. పదిరోజులకు పైగా అదే పనిలో ఉన్న అధికారులు మళ్లీ మరో వారం పదిరోజులు అదే పనిలో ఉండాలని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల తమశాఖాపరంగా నిత్యం జరిగే పనులు పెండింగ్‌ కావడమే గాకుండా రాత్రి, పగలు ఇబ్బందిపడాల్సి ఉంటుంది వాపోతున్నారు. 

అరకొర పనులకు నిధులు వృథా..

ముఖ్యమంత్రి పర్యటన పేరిట విజయనగరం పట్టణంలో జరుగుతున్న పనులపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన పర్యటన నేపథ్యంలో విజయనగరం మున్సిపాలిటీ చేపట్టే పనుల కోసం రూ3 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో  కేవలం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాం తాల్లో పలు ఆర్భాటపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు.

నాలుగు రో జులుగా చేపడుతున్న ఈ పనుల నాణ్యతపై నగరవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా గల మీసేవ కేంద్రానికి బీటీ రోడ్డు, ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట పెద్ద చెరువుకు గట్టు ఎక్కేందుకు మెట్ల మార్గం నిర్మించారు.

ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్నగోడలకు రంగులు వేసి, రోడ్లపై పేరుకుపోయిన మట్టిదిబ్బ లను తొలగించి, మొక్కలు నాటించారు. గుంతలు పడిన రహదారులపై క్రషర్‌ బుగ్గి వేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన రద్దయినా... ఈ నెలలో మరోసారి వచ్చే అవకాశం ఉన్నందున ఆ సమయానికి ఈ పనుల పరిస్థితి ఏమిటన్నదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top