జెడ్పీలో ఇష్టారాజ్యం

Corruption In Zilla Parishad Krishna - Sakshi

అంతా ఏకపక్షమే నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు

ఉద్యోగుల బదిలీలపై సర్వత్రా విమర్శలు

సర్వసభ్య సమావేశం నిర్వహణలోనూ ఒంటెత్తుపోకడే

తేదీ ప్రకటించి మరీ వాయిదా

అందుబాటులో ఉండని జెడ్పీ చైర్‌పర్సన్‌

జిల్లా పరిషత్‌ పరిపాలన గాడి తప్పింది. పాలకపక్షం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జెడ్పీని టీడీపీ కార్యాలయంగా మార్చేశారనే విమర్శలొస్తున్నాయి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం, ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. గొంతు నొక్కడం సర్వసాధారణంగా మారిపోయింది. జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఉద్యోగుల బదిలీల్లోనూ నిబంధనలకు తిలోదకాలిచ్చారనే ఆరోపణలున్నాయి. మూడేళ్ల కాల పరిమితి ముగియకుండానే కొందరిని బదిలీ చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీ సమావేశాల్లో సైతం సమస్యలపై చర్చ సాగడం లేదనే వాదన వినిపిస్తోంది.

సాక్షి, మచిలీపట్నం: జిల్లా పరిషత్‌ (జెడ్పీ)లో ఆటవిక పాలన సాగుతోందా? తమకు ఇష్టమొచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారా? పాలకపక్షం తమ సొంత కార్యాలయంగా మలచుకుందా? అంటే అవుననే సమాధానం చెప్పా ల్సిన పరిస్థితి. ఇందుకు పాలక పక్షం వ్యవహరి స్తున్న తీరు బలం చేకూర్చుతుంది. జిల్లా పరిషత్‌ ప్రజా సమస్యలపై విస్తృతమైన చర్చ జరిగే వేదిక. మంత్రులు, కలెక్టర్, జెడ్పీ చైర్మన్‌ సభా వేదికపై ఆసీనులై ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో నిర్వహించే చర్చ. ప్రతి మూడు నెలలకోసారి ప్రతిపక్ష, పాలకపక్ష ఎంపీటీసీ సభ్యులు ఒకే చోట చేరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు వెతికే నిర్ణయాలు తీసుకోవడంతో జిల్లా పరిషత్‌ కీలక భూమిక పోషిస్తుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న శాఖలో పరిస్థితి కట్టుతప్పింది. పాలక పక్షం తమకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెడ్పీ కార్యాలయం అన్న భావన నుంచి బయటకు వచ్చి టీడీపీ కార్యాలయంగా మార్చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బదిలీలలు
జిల్లాలో ఇటీవల 40 మంది ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేశారు. వీటిలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. బదిలీలకు సదరు ఉద్యోగి ఒక కార్యాలయంలో కనీసం మూడేళ్లు పనిచేయా లన్నది  నిబంధన. కానీ ఇక్కడ ఇలాంటివేమీ వర్తించవు. ఆరు నెలలు పనిచేసిన వారిని సైతం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చల్లపల్లి, పామర్రు మండలాల్లో ఈ తంతు సాగింది. పరస్పర బదిలీలకు సైతం మూడేళ్లు పనిచేయాలన్నది ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉన్నా.. 8 నెలలు దాటకనే బదిలీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జెడ్పీ సీఈవో సెలవులో ఉన్న సమయంలో డిప్యూటీ సీఈవోతో తంతు కానిచ్చేశారు. డిప్యూటీ సీఈవోకు బదిలీల అధికారం లేదు. కేవలం పాలన పరమైన ఫైళ్లపై సంతకాలు మాత్రమే చేయాల్సి ఉంది.
ఏవైనా అవినీతి, పాలన పరమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తే.. అనంతరం ఆ ఉద్యోగి విధుల్లో చేరితే అతను ఇంతకు ముందు పనిచేసిన కార్యాలయం లో కాకుండా వేరే చోట పోస్టింగ్‌ ఇవ్వాలి. కానీ గన్నవరంలో ఓ ఉద్యోగి సస్పెండ్‌ అయితే తిరిగి అక్కడే పోస్టింగ్‌ ఇచ్చారు.
జెడ్పీ చైర్మన్‌ ఎల్లప్పుడు కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది. వారంలో కేవలం మంగళవారం మాత్రమే కార్యాలయానికి దర్శనమివ్వ డం, మిగిలిన రోజుల్లో విజయవాడలో ఉండటంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాలు సైతం సింహభాగం మంగళవారమే నిర్వహించడాన్ని బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. కేవలం జెడ్పీ సమావేశమే కాదు.. ఎలాంటి సమావేశాలైనా మంగళవారమే నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది.
గత నెల 19న జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని భావించారు. తిరిగి ఈనెల 10న  నిర్వహిస్తామని వాయిదా వేశారు. ఒక సారి జెడ్పీ సమావేశం తేదీ ప్రకటిస్తే విధిగా నిర్వహించాలి. కోరం లేని పక్షంలో వాయిదా వేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం జిల్లాలో మంత్రి లోకేష్‌ పర్యటన ఉన్న నేపథ్యంలో వాయిదా వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు  ప్రజా సమస్యలపై చర్చ జరిగే సమావేశం వాయిదా వేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు అడ్డుగా ఉందని కృష్ణమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం బహిర్గతం కావడంతో తిరిగి కృష్ణమ్మ విగ్రహాన్ని రాత్రికి రాత్రే ప్రతిష్టించారు.
జెడ్పీ చైర్మన్‌ గతేడాది 20 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లారు. సాధారణంగా చైర్మన్‌ జిల్లా దాటి 14 రోజులకు మించి వెళితే ఇన్‌చార్జి బాధ్యతలు ఇతరులకు అప్పగించి వెళ్లాలి. 20 రోజులు వెళ్లినా ఇతరులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిం చిన దాఖలాలు లేవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   
జెడ్పీ అజెండా పుస్తకాలు నేరుగా సభ్యులకు పంపాల్సి ఉండగా.. మండల కేంద్రాలకు పంపి సభ్యులే వచ్చి వాటిని తీసుకెళ్లాలని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అడుగడుగునా అడ్డంకులు..
ప్రతిసారి నిర్వహించే జెడ్పీ సర్వసభ్య సమావే శంలో ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ సభ్యులు విద్య, వైద్యం తదితర అంశాలపై చర్చ లేవనెత్తడం.. పాలకపక్ష సభ్యులు అడ్డంకులు సృష్టించడం పరిపాటిగా మారింది. ఈ చర్యలకు నిరసనగా గత సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. కోరం లేకపోయినా పాలపక్ష సభ్యులు అంతా తామై వ్యవహరించి సమావేశం నిర్వహించి మమ అనిపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top