సమయం లేదు మిత్రమా.. దోచుకో! | Corruption In Veterinary Affairs Office Prakasam | Sakshi
Sakshi News home page

సమయం లేదు మిత్రమా.. దోచుకో!

Aug 16 2018 1:42 PM | Updated on Aug 16 2018 1:42 PM

Corruption In Veterinary Affairs Office Prakasam - Sakshi

ప్రకాశం, యర్రగొండపాలెం: అధికార పార్టీకి చెందిన నాయకుల ఆగడాలకు ఫుల్‌స్టాప్‌ పడటంలేదు. అందిన కాడికి దోచుకో.. రేపు ప్రభుత్వం చేజారిపోతుంది.. ఆ తరువాత దిగమింగటానికి ఏమీ ఉండదు అన్న చందంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. గుంతలు తీయకుండా తీసినట్లు కోట్లు కాజేశారు. నాసిరకం చెక్‌ డ్యాంలు కట్టి లక్షలకు లక్షలు మింగారు. పేద రైతులకు అందాల్సిన మొక్కల బిల్లులు బినామీ పేర్లతో కాజేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్, వాటర్‌షెడ్, వెలుగు శాఖలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. గృహనిర్మాణం, మరుగుదొడ్లు, పింఛన్లు మంజూరు చేయటానికి లంచం తీసుకున్నారు. ఇంకా పేద ప్రజలవద్ద పిండుకోవటానికి ఏమీలేవు. అందుకే ఇప్పుడు అడవుల్లో జీవించే గిరిజనులపై పడ్డారు టీడీపీ నేతలు. వారికి అందాల్సిన పథకాలు అందనివ్వకుండా మధ్యలోనే పచ్చనేతలు ఎగిరెగిరి అందుకుంటున్నారు. అందుకు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి అండదండలు ఉండటమే ప్రధాన కారణం. అధికారులు సైతం తప్పని పరిస్థితుల్లో వారికి దాసోహం అనక తప్పడంలేదు. తాజాగా పొట్టేళ్ల యూనిట్లను కాజేయటానికి టీడీపీ వర్గీయులు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఎలా?
ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద మంజూరైన యూనిట్లను బినామీ పేర్లతో అరకోటి రూపాయలు తమ సొంతం చేసుకోవాటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పశుసంవర్థక శాఖ పరంగా ఈ యూనిట్లు మంజూరవుతాయి. లబ్ధిదారుడు రూ. 7,500 చెల్లిస్తే ప్రభుత్వం రూ. 20వేలు కలిపి మొత్తం రూ. 27,500 ఖరీదు చేసే పొట్టేళ్లను సరఫరా చేస్తారు. ఈ పొట్టేళ్లను కూడా లబ్ధిదారులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పొట్టేళ్ల యూనిట్ల మంజూరులో రాజకీయం చోటు చేసుకోవడంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఎస్టీలకు దక్కకుండా ఏకంగా తామే ఈ యూనిట్లను కాజేయటానికి ప్రయత్నిస్తున్నారు. యర్రగొండపాలెం మండలానికి 140 యూనిట్లు, పుల్లలచెరువు మండలానికి 110 యూనిట్లు మంజూరయ్యాయి. ముందుగా లబ్ధిదారుడు రూ. 7,500 డీడీ రూపంలో అందచేయాలి. అంతేకాకుండా లబ్ధిదారుడు తన ఆ«ధార్‌ కార్డు జెరాక్సును అందచేయాల్సి ఉంటుంది. యర్రగొండపాలెం మండలానికి చెందిన ఒక ప్రజాప్రతినిధితోపాటు మరో ఇద్దరు టీడీపీ నాయకులు, పుల్లలచెరువు మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ అధినాయకులు ఈ యూనిట్లను తమ సొంతం చేసుకోవటానికి పథకం పన్నారు.

వెంటనే రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఎస్టీల నుంచి ఆధార్‌ జెరాక్స్‌ కాపీలను సేకరించుకున్నారు. ఈ రెండు మండలాలకు చెందిన 240 మంది లబ్ధిదారుల జాబితా తీసుకొనివెళ్లి విజయవాడలోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో అందచేశారు. తమ పలుకుబడిని ఉపయోగించుకొని ఆ యూనిట్లను మంజూరు చేయించుకున్నారు. ఈ యూనిట్లు రెండు, మూడు రోజుల్లో లబ్ధిదారులకు చేరాల్సి ఉంది. ఈ యూనిట్లను ఇతర జిల్లాల్లో కొనుగోలు చేయాల్సి ఉంది. ఒక్కొక్క యూనిట్‌కు సంబంధించిన రూ. 27,500 తమకు అనుకూలంగా ఉన్న పొట్టేళ్ల యజమానుల పేర్లతో చెక్కులను తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుణాలు ఇప్పిస్తామని ఆధార్‌ కార్డులు తీసుకున్న నాయకులు లబ్ధిదారుడికి ఎటువంటి సమాచారం అందివ్వక పోవడంతో తమకు రుణాలు ఎప్పుడు మంజూరవుతాయని కొంత మంది లబ్ధిదారులు వారిని ప్రశ్నించారు. రుణాలు మంజూరులో జాప్యం జరుగుతుందని మాయమాటలు చెప్తూ వచ్చారని తెలిసింది. యూనిట్ల గురించి తెలుసుకున్న మరి కొంతమంది ఎస్టీలు తమకు పొట్టేళ్లు మంజూరయ్యాయని తెలిసిందని, అందుకు కావలసిన డబ్బులు చెల్లించటానికి సిద్ధంగా ఉన్నామని నాయకులను నిలదీయడంతో అసలు విషయం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. ఈ విషయం బయటికి రాకుండా తమకు అనుకూలంగా ఉన్నవారిని వారు బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. వెంటనే పశుసంవర్థకశాఖ ఉన్నతాధికారులు ఈ యూనిట్లపై దర్యాప్తు జరిపి వాస్తవ లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు అయ్యే విధంగా చూడాలని గిరిజన నాయకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement