అమ్మకానికి ‘ఆధార్’ ! | corruption in Aadhaar Enrolment Centre | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ‘ఆధార్’ !

Feb 8 2014 3:13 AM | Updated on Oct 16 2018 7:36 PM

కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన ఓ నలుగురు కుటుంబ సభ్యులు ఆధార్ కార్డు దిగేందుకు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లారు.

కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన ఓ నలుగురు కుటుంబ సభ్యులు ఆధార్ కార్డు దిగేందుకు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లారు. వీరి కుటుంబంలో తల్లిదండ్రుల పేర్లు మాత్రమే రేషన్‌కార్డులో నమోదై ఉన్నాయి.

ఇద్దరు పిల్లలకు గుర్తింపు కార్డులు లేవు. ముందుగా ఒక్కొక్కరికి రూ.వంద చొప్పున వసూలు చేసిన ఎన్‌రోల్‌మెంట్ నిర్వాహకులు ఇద్దరికి గుర్తింపు కార్డులు లేకపోవడం, రేషన్‌కార్డులో వారి పేర్లు లేకపోవడంతో మరో రూ.వంద అదనంగా వసూలు చేశారు. ఇలా వారు రూ.600 సమర్పించుకుని ఆధార్ దిగాల్సి వచ్చింది. ఇలా ఎన్‌రోల్‌మెంట్ నిర్వాహకులు ఒక్కో సెంటర్ నుంచి రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


  నాలుగు నెలల క్రితం వరకు ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా తరలిరావడంతో ఒక ఎన్‌రోల్‌మెంట్‌కు రూ.1000 వరకు వసూలు చేసిన నిర్వాహకులు ఇప్పుడు ఎన్‌రోల్‌మెంట్ కోసం వచ్చేవారి సంఖ్య తగ్గడంతో నిర్ణీత ధర నిర్ణయించారు. రెండు నెలల క్రితం జిల్లాలో పర్మనెంట్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో బాగంగా జిల్లాలోని మీ సేవా సెంటర్లలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి ఎన్‌రోల్‌మెంట్ చేసుకునేందుకు వెళ్లేవారు సొమ్ములు చెల్లించకపోతే ఆధార్ కార్డు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

 పైసలిస్తేనే పని...
 నిర్వాహకులు అడిగినట్లు రూ.100 చెల్లిస్తే వాటిని ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ చేస్తున్నారు. అయితే ‘ప్రభుత్వం మీకు డబ్బులు చెల్లిస్తుంది కదా..? మేమెందుకు ఇవ్వాలి’ అని ఎవరైనా దబాయిస్తే వారికి కార్డు మాత్రం రానట్లే. కేవలం కంప్యూటర్‌లో ఫొటోలు తీసి ఆధార్ దిగినట్లుగా కాపీని అందిస్తున్న నిర్వాహకులు ఆ తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్‌మెంట్ చేయకపోవడంతో జిల్లాలో సుమారు లక్ష మంది వరకు ఆధార్ కార్డులు దిగి.. నెలల తరబడి ఎదురుచూస్తున్నా కార్డులు అందడం లేదు. నిర్వాహకులు అడిగిన సొమ్ములు చెల్లించుకున్న వారికి మాత్రం నెల రోజుల లోపు కార్డులు వస్తున్నాయి.  

 చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న  రెవెన్యూ అధికారులు..
 ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ కార్డు అందేలా చూడాల్సిన రెవెన్యూ అధికారులు ఈ వసూళ్ల పర్వంపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్ సెంటర్ల వద్ద వసూళ్ల పర్వం బహిరంగంగానే జరుగుతునప్పటికీ వాటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు అంటున్నారు.

 ఈ విషయంపై ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ సూపర్‌వైజర్ రవికుమార్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఆధార్ కేంద్రాల వద్ద వసూళ్లు నిజమేనని, కానీ ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేయడం లేదని పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా ఆధార్ కేంద్రాల వద్ద సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల పర్వంపై ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు దృష్టి సారించి, అక్రమ వసూళ్లను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement