విద్యుత్‌శాఖ ఏడీఈ గుట్టురట్టు | Corruption activities electric department | Sakshi
Sakshi News home page

విద్యుత్‌శాఖ ఏడీఈ గుట్టురట్టు

Nov 25 2014 2:00 AM | Updated on Sep 22 2018 8:22 PM

విద్యుత్‌శాఖ ఏడీఈ అవినీతి గుట్టురట్టయింది. బదిలీ అయిన ఏడీఈ...

యర్రగొండపాలెం : విద్యుత్‌శాఖ ఏడీఈ అవినీతి గుట్టురట్టయింది. బదిలీ అయిన ఏడీఈ.. ఇన్‌చార్జి ఏడీఈకి బాధ్యతలు అప్పగించిన అనంతరం కూడా కార్యాలయంలోనే ఉండి అవినీతికి పాల్పడటంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకెళ్తే... యర్రగొండపాలెం మండలంలోని గుర్రపుశాలకు చెందిన మందా ఇస్సాకు అనే రైతు తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు.

త్వరగా ఎస్టిమేషన్‌వేసి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ 15 రోజుల క్రితం విద్యుత్‌శాఖ యర్రగొండపాలెం సబ్‌డివిజన్ అధికారి (ఏడీఈ) ఎస్.శ్రీనివాసరెడ్డిని కలిశాడు. అందుకోసం తనకు రూ.20 వేలు ఇవ్వాలని ఏడీఈ డిమాండ్ చేయడంతో, అంతమొత్తం ఇవ్వలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు రూ.13 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ముందుగా రూ.5 వేలు ఇచ్చాడు.

 మిగిలిన రూ.8 వేలు రెండు వారాల్లో ఇస్తానని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చే స్థోమతలేక, ఏడీఈ వేధింపులు భరాయించలేక ఈ నెల 22వ తేదీ ఒంగోలులోని ఏసీబీ అధికారులకు ఇస్సాకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ జిల్లా డీఎస్పీ ఆర్‌వీఎస్‌ఎన్ సత్యనారాయణమూర్తి, ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, ఎన్.శివకుమార్‌రెడ్డి, ఎస్సై వెంకటేశ్వరరావు, సిబ్బంది రంగంలోకి దిగారు. సోమవారం యర్రగొండపాలెం చేరుకుని ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇస్సాకుకు కెమికల్స్ పూసిన 500 రూపాయల నోట్లు 16 (రూ.8 వేలు) ఇచ్చి కార్యాలయంలో ఉన్న ఏడీఈ వద్దకు పంపారు. ఇస్సాకు ఆ నోట్లను ఏడీఈ శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement