
మహిళలపై మోచేయి వేసి నెడుతున్న ఎస్సై
30 మంది పోలీసులు, ముగ్గురు ఎస్సైలు, సీఐ అరాచకం
వైఎస్సార్‌సీపీ ముండ్లమూరు మండల కన్వినర్ దుకాణాలు కూల్చివేత
మహిళలనూ ఈడ్చిపడేసి లాఠీచార్జిచేయించిన సీఐ రామారావు
పోలీసులపై దుమ్మెత్తి పోసిన గ్రామ మహిళలు
ముండ్లమూరు(దర్శి): ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ మండల కన్వినర్‌కు చెందిన దుకాణాల కూల్చివేతకు గ్రామానికి భారీగా తరలివచ్చారు. రావడం రావడంతోనే అరాచకానికి దిగారు. అడ్డొచ్చిన మహిళలను రోడ్డుపై ఈడ్చిపడేశారు. లాఠీలు ఝుళిపించారు. అరెస్టు చేసి పోలీసు జీపు ఎక్కించేందుకు యత్నించారు. దీంతో గ్రామస్తులు ఎదురుతిరిగారు.
టీడీపీ నేతల ఒత్తిడితోనే..
వైఎస్సార్ సీపీ ముండ్లమూరు మండలం కన్వినర్ చింతా శ్రీనివాసరెడ్డి పసుపుగల్లు గ్రామంలో ఉంటున్నారు. ఆయనకు, ఆయన సోదరి భర్త రత్నారెడ్డి పేరున గ్రామ ప్రధాన సెంటర్‌లో రెండు సెంట్ల స్థలం ఉంది. వ్యాపారాలకు అనుకూలంగా ఉండడంతో 30 ఏళ్లుగా రేకుల షెడ్‌లు వేసుకుని దుకాణాలు నడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చడీచప్పుడు లేకుండా మంగళవారం తెల్లవారుజామున దర్శి ఎస్సై మురళి, ముండ్లమూరు ఎస్సై కమలాకర్, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున్‌తోపాటు సుమారు 30 మంది పోలీసులు పొక్లెయిన్లతో గ్రామానికి వచ్చారు. దుకాణాల కూల్చివేతకు యత్నించారు.
శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరి, కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు ఇవి అక్రమ నిర్మాణాలని, కూల్చివేయాలని గ్రామ కార్యదర్శి మౌలాలి ఫిర్యాదు చేశారని ఎస్‌ఐలు చెప్పారు. దీంతో కార్యదర్శిని పిలిచి తమ దుకాణాలు కూల్చేందుకు ఎవరు తీర్మానం చేశారని ప్రశి్నంచగా ‘‘పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మేం చేస్తున్నాం. పైవాళ్లు చెప్పినట్లు మేం వినాలిగా మాదేముంది’’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రిజిస్టర్డ్ భూమి అని కావాలంటే కొలతలు వేసి చూసుకోవాలని సూచించారు. అయినా కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని సెక్రటరీని, పోలీసులను నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని పోలీసులు ఫోన్‌లో సీఐ రామారావుకు తెలియజేయడంతో ఆయన వచ్చి వీరంగం చేశారు.
‘‘ఏయ్ ఎవడ్రా అడ్డు వచ్చేది? మర్యాదగా పక్కకు తప్పుకోండి. అడ్డొస్తే కేసులు పెడతాం’’ అంటూ చిందులు తొక్కారు. దీంతో పోలీసులు పైశాచికత్వం ప్రదర్శించారు. మహిళలని కూడా చూడకుండా రోడ్డుపై పక్కకు లాగిపడేశారు. లాఠీలను ఝుళిపించారు. మహిళలను పక్కకు లాగేందుకు మహిళా పోలీసులు ఉన్నా.. మగ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మహిళలను అసభ్యంగా తిడుతూ లాగి పడేశారు.
దీంతో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి, స్థానిక టీడీపీ నాయకుడు బిజ్జం సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే పోలీసులు బరితెగిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో తమ గ్రామంలో వైఎస్సార్ సీపీకి 248 ఓట్ల మెజార్టీ వచ్చిందని, దానిని సహించలేకే తమపై ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయినా సీఐ పట్టించుకోలేదు. సెక్రటరీతో మాట్లాడుకోవాలని పోలీసులు దౌర్జన్యాన్ని కొనసాగించారు. చివరకు గ్రామస్తులు పోలీసులపై తిరగబడడంతో చేసేది లేక రేకుల షెడ్ కూల్చివేసి అక్కడి నుంచి జారుకున్నారు.