
పలు షరతులు విధించిన హైకోర్టు
ట్రోల్ చేసేందుకు ఈ తీర్పు మరో మంచి అవకాశం
ట్రోలర్లకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి చురకలు
న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రోలర్ల గురించి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందంటూ చురకలంటించారు.
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ నమోదైన కేసులో ప్రధాన నిందితులైన వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావడా, బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్‌లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని వారిని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా విషయంలో సీబీఐ సిట్ నమోదు చేసిన కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్లు నాలుగున్నర నెలలకు పైగా జైల్లో ఉన్నారని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే దర్యాప్తు మొత్తం పూర్తయిందని, కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి వారిని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించారని పేర్కొన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యారని, అడిగిన డాక్యుమెంట్లన్నీ కూడా అందచేశారని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. పిటిషనర్లు సాక్షులను బెదిరించారన్న సీబీఐ ఆరోపణలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సీబీఐవి కేవలం నిందారోపణలే తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
నా ఈ తీర్పు ట్రోలర్లకు మంచి అవకాశం..
ఈ తీర్పు వెలువరించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి సామాజిక మాధ్యమాల ట్రోలర్ల గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సింగయ్య మృతి వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది కూడా జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ట్రోల్ చేసేందుకు కూటమి మద్దతు ట్రోలర్లకు అవకాశంగా మారింది.