ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కార్పొరేట్లు


 • ఆ దిశగా ముందుకు వెళుతున్నామన్న సింగపూర్ మంత్రి

 • 7 అభివృద్ధి కారిడార్లకు ప్రణాళిక

 • వాటి నిర్మాణంలోనూ సింగపూర్ వ్యాపార దిగ్గజాలు • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో సింగపూర్‌కు చెందిన కార్పొరేట్ కంపెనీలు రంగప్రవేశం చేయనున్నాయి. ఆయా కంపెనీలు రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ ప్రాజెక్టులు చేపట్టబోతున్నాయి. సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ మధ్యవర్తిగా వ్యవహరించి తయారు చేయించిన మొదటి విడత ప్రణాళికను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందజేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన రెండు దశల ప్రణాళికలు పూర్తయిన అనంతరం కార్పొరేట్ దిగ్గజాలు రంగంలోకి దిగనున్నాయి.  ఈ విషయాన్ని మార్చి 30న సింగపూర్‌లో మాస్టర్‌ప్లాన్ అందజేసిన సమయంలో ఆదేశ వాణిజ్య శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్పష్టం చేశారు. రాజధానికి సంబంధించి మిగిలిన రెండు ప్రాజెక్టులు (రెండు దశల ప్రణాళికలు) నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని, సింగపూర్ కంపెనీలకు అవకాశం లభించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి ముందుకు వెళుతున్నామని ఆ సందర్భంగా ఈశ్వరన్ పేర్కొన్నారు. దాన్ని బట్టి రానున్న రోజుల్లో రాజధాని కోసం చేపట్టే ప్రాజెక్టుల్లో సింగపూర్ కార్పొరేట్ దిగ్గజాలు రంగంలోకి వస్తాయన్న విషయం రూఢీ అవుతోంది.  ఇది ఇలావుండగా, రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ కార్పొరేట్ సంస్థలు తయారు చేశాయి. అయితే మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం రూపొందించి అందజేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ (ఐఈ-సింగపూర్) సంస్థ మాస్టర్‌ప్లాన్ తయారు చేయలేదు. ఆ మాస్టర్‌ప్లాన్ తయారు చేసే బాధ్యతను సింగపూర్‌లోని మరో రెండు కార్పొరేట్ సంస్థలకు ఐఈ అప్పగించింది. సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, జురాంగ్ కన్సల్టెంట్స్‌ల ద్వారా ఈ మాస్టర్‌ప్లాన్ తయారు చేయించినట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్వయంగా తెలియజేశారు. ఈ సంస్థలే సమీప భవిష్యత్తులో రాజధానిలో రంగ ప్రవేశం చేయనున్నాయని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.

   

  కారిడార్లలోనూ కాలు పెట్టనున్న కంపెనీలు
  పలు రంగాలకు చెందిన ఏడు అభివృద్ధి కారిడార్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అభివృద్ధి కారిడార్లు ఏర్పాటయ్యే ప్రాంతాలు, రంగాలను మాస్టర్‌ప్లాన్‌లో నిర్దేశించారు. ఎక్కడెక్కడ  ఏర్పాటు చేస్తారన్న వివరాలను ‘సాక్షి’ సేకరించింది. నూతన రాజధానిలో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వైపు రెండు అభివృద్ధి కారిడార్లను నెలకొల్పుతారు. వాటిల్లో నందిగామ కారిడార్‌లో ఫార్మా, బయోటెక్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ రంగాలను అభివృద్ధి చేస్తారు.  గుడివాడ కారిడార్‌లో హరిత పరిశ్రమలు, అక్వా కల్చర్ రంగాలను అభివృద్ధి చేస్తారు. అలాగే విశాఖ నుంచి చెన్నై వైపు మరో రెండు కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. దీనిలో గన్నవరం కారిడార్‌లో ఐటీ, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్/హార్డ్‌వేర్, ఆటోమోటివ్, ఏరోస్పేస్ రంగాలను అభివృద్ధి చేస్తారు. గుంటూరు కారిడార్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్స్, టెక్స్‌టైల్స్, నాన్ మెటాలిక్స్ ఉత్పత్తుల రంగాలను అభివృద్ధి చేస్తారు. ఇక తెనాలి కారిడార్‌లో లాజిస్టిక్స్, టూరిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలను,  సత్తెనపల్లి కారిడార్‌లో టూరిజం, నాలెడ్జ్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తారు. నూజివీడు కారిడార్‌లో వ్యవసాయ అధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తారు. వీటిలోనూ విదేశీ కార్పొరేట్ సంస్థలే రంగప్రవేశం చేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.

   

  దీర్ఘకాలిక లీజుపై భూముల కేటాయింపు  నూజివీడు, గుడివాడ, తెనాలి, సత్తెనపల్లి, నందిగామ, గుంటూరు చుట్టుపక్కల, తాడేపల్లి ప్రాంతాలను పట్టణాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు భూములను 99 ఏళ్ల లీజు విధానంలో కేటాయించనున్నారు. రాజధాని చుట్టూ హైస్పీడు రైలు మార్గాన్ని నెలకొల్పనున్నారు. విశాఖ నుంచి చెన్నై మధ్య హైస్పీడ్ రైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. గుంటూరు-తెనాలి-గన్నవరం-నందిగామలను కలుపుతూ రీజినల్ ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు చేస్తారు. మచిలీపట్నం-చిలకలూరిపేట-నరసరావుపేట-సత్తెనపల్లి-నందిగామ-ఏలూరుల మీదుగా ఔటర్ రీజినల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top