కరోనా ఫలితం.. ఇక ఒక్కరోజులోనే

Coronavirus Test Result Is Available In One Day In East Godavari District - Sakshi

ప్రతిరోజూ విజయవాడకు 200 శాంపిళ్లు 

కాకినాడలో 170 నమూనాలు పరీక్ష   

కరోనా పరీక్షల రిపోర్టుల కోసం ఇన్నాళ్లూ వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు జగన్‌ సర్కారు తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఫలితం త్వరితగతిన రోగి చెంతకు చేరి సాంత్వన చేకూరుస్తోంది. విశాఖలో కొత్తగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో కాకినాడలోని పరీక్ష కేంద్రంపై ఒత్తిడి తగ్గడంతో ఈ వెసులుబాటు వచ్చింది.

సాక్షి, రాజమహేంద్రవరం: కరోనా మహమ్మారిని 24 గంటల్లో పసిగట్టేస్తారు. ఇంతవరకూ కాకినాడ సామాన్య ప్రభుత్వాస్పత్రిలో వందల శాంపిళ్లు వచ్చిపడుతున్నా నివేదికలు రావడానికి రోజులు తరబడి పట్టేది. కనీసంగా ఒక నివేదిక కోసం నాలుగైదు రోజులు నిరీక్షించే పరిస్థితి. మన జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి శాంపిళ్లు కాకినాడ లే»ొరేటరీకే వచ్చేవి. నాలుగు జిల్లాల నుంచి వచ్చే శాంపిళ్లలో అనుమానం ఉంటే ఒకటికి, రెండుసార్లు అవసరమైతే మూడు పర్యాయాలు పరీక్షలు చేసి నిర్థారించుకున్నాకనే ఫలితాన్ని ప్రకటించే వారు. రోజువారీగా నాలుగు జిల్లాల నుంచి 500 పైబడే శాంపిళ్లు కాకినాడ జీజీహెచ్‌కు పరీక్షల కోసం వచ్చేవి. దీనివల్ల జరిగే జాప్యాన్ని నివారించి పరీక్షలు, నివేదికలు వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని విశాఖపట్నంలో ప్రత్యేకంగా లేబొరేటరీ ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కాకినాడకు కరోనా శాంపిల్స్‌ సోమవారం నుంచి పంపడం ఆపేశారు. ఫలితంగా కాకినాడలో ప్రయోగశాల ఈ జిల్లా వరకే పరిమితం కావడంతో ఇక్కడి నివేదికలు ఒక్క రోజులోనే చేతికివచ్చే సానుకూలత ఏర్పడింది. 

రెడ్‌జోన్లపై నిరంతర నిఘా 
ఓ పక్క శాంపిల్స్‌ పరీక్షలను వేగవంతంచేస్తూ.. మరోపక్క ఆ మహమ్మారిని బయట ప్రాంతాల నుంచి అడుగుపెట్టకుండా జిల్లాలో దారులన్నీ మూసేశారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిని రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. కత్తిపూడిలో పాజిటివ్‌గా నమోదైన ఒక ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం మరో ఐదుగురికి వ్యాధి సోకడంతో రెడ్‌ జోన్‌లపై జిల్లా యంత్రాంగం నిరంతర నిఘాలో పెట్టింది. రెడ్‌జోన్‌ చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకూ ఉన్న ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్లుగా పేర్కొని కంటోన్మెంట్‌గా డిక్లేర్‌ చేశారు. అటువంటి ప్రాంతాలన్నింటినీ జిల్లా యంత్రాంగం పూర్తి అజమాయిషిలో పెట్టుకుని ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తోంది. జిల్లాలో ఉన్న ఎనిమిది రెడ్‌జోన్ల పరిధిలో ఉన్న 32,194 కుటుంబాలపై ప్రత్యేక నిఘా ఉంచాయి.

ఈ జోన్ల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ప్రతి రోజు నిశితంగా పరిశీలించి జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించేలా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా సమాచారాన్ని సేకరించి కోవిడ్‌ జిల్లా నోడల్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌–2 రాజకుమారి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తున్నారు. దీనివల్ల రెడ్‌జోన్లలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నారు. ఈ ఎనిమిది జోన్‌లలో ప్రతి రోజు ర్యాండమ్‌గా 40 శాంపిళ్లు సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎనిమిది బృందాలు  క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవేకాకుండా రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి 80, పెద్దాపురం, పిఠాపురం, కత్తిపూడి, కొత్తపేట రెడ్‌జోన్‌ల నుంచి 30 వంతున మొత్తంగా ప్రతి రోజు 200 నమూనాలు ప్రత్యేక ఐసోలేటెడ్‌ అంబులెన్స్‌లో విజయవాడకు పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనరేట్‌ నుంచి జిల్లాకు ఆదేశాలు వచ్చాయి. వీటితో సంబంధం లేకుండా కాకినాడ కరోనా లేబరేటరీలో ప్రతి రోజూ 170 శాంపిళ్లు పరీక్షించనున్నారు.

కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి 25 వంతున, జిల్లాలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, వలంటీర్లు, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రిఫర్‌ చేసే కేసుల్లో 120తో కలిపి మొత్తం 170 శాంపిళ్లు రోజూ పరీక్షించి నివేదికలు రూపొందించాలనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇక్కడకు శాంపిల్స్‌ వచ్చే అవకాశం లేకపోవడంతో పరీక్షలు ఎక్కువ చేయడం కంటే నివేదికలు త్వరగా రావడానికి మార్గం సుగమం కానుంది. సోమవారం ఒక్క రోజే 141 శాంపిల్స్‌ సేకరించారు. జిల్లాలో మొత్తంగా 1638 శాంపిళ్లు సేకరించగా 1309 నివేదికలు రాగా, మరో 329 నివేదికలు రావాల్సి ఉంది. 3,442 మంది హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. 

‘ఇక వేగవంతంగా నివేదికలు’ 
కరోనా పరీక్షలు, నివేదికలు త్వరగా బయటకు రానున్నాయి. కేవలం 24 గంటల్లోనే నివేదికలు అందజేసే వెసలుబాటు కూడా మన జిల్లాకు లభించింది. ఇంతవరకూ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా కాకినాడ లే»ొరేటరీకి శాంపిళ్లు వస్తుండేవి. ఈ కారణంగా మన జిల్లాలో వచ్చే శాంపిళ్లు పరీక్షలు జరిపి నివేదికలు బయటకు రావడానికి రోజులు పట్టేది. ఇక ముందు ఆ పరిస్థితి లేదు. కాకినాడ జీజీహెచ్‌లో జిల్లాలో సేకరించే శాంపిళ్లు మాత్రమే ఇక్కడ పరీక్షించనుండటంతో నివేదికలు వెంటవెంటనే వచ్చేస్తాయి.  
డి.రాజకుమారి,  జేసీ–2. కోవిడ్‌–19 నోడల్‌ అధికారి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top