పొగాకు రైతుకు కోవిడ్‌ దెబ్బ!

Coronavirus Effect To Tobacco farmers - Sakshi

చైనాకు ఆగిపోయిన ఎగుమతులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చైనాలో ప్రబలిన కోవిడ్‌ (కరోనా) మన పొగాకు రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది చైనా బృందం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించి సాగులో ఉన్న పొగాకు పంటలను పరిశీలించి వెళ్లింది. దీంతో రైతుల్లో చైనాకు ఎగుమతులు మెరుగుపడతాయన్న ఆశలు చిగురించాయి. ఇంతలో చైనాలో కోవిడ్‌ విజృంభించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. సకాలంలో వర్షాలు పడటంతో మంచి దిగుబడి, ఎగుమతులు సాధించవచ్చని ఆశించిన రైతులు కోవిడ్‌ ప్రభావంతోపాటు దేశంలోనూ సరైన ధర లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మధ్యలో అధిక వర్షాలు పంటను దెబ్బతీశాయి. దీంతో పొగాకు కోత కోయకుండానే పండుగుల్ల ఆకును వదిలేయాల్సిన దుస్థితి రైతులకు ఎదురైంది. 

ఈ ఏడాది ముందుగానే ప్రారంభించినా..
గతేడాది పొగాకు క్రయవిక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది వేలాన్ని ముందుగానే ప్రారంభించింది.. పొగాకు బోర్డు. ఫిబ్రవరి 17 నుంచే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకు వేలం ప్రారంభమైంది. గతేడాది తొలి విడతలో మార్చి 22 నుంచి, రెండో విడతలో మార్చి 27 నుంచి వేలాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో దక్షిణాది తేలిక నేలలు, నల్లరేగడి నేలల్లో కలిపి పది మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి అదనంగా వచ్చింది. 2019–20 పొగాకు ఉత్పత్తి లక్ష్యం 84 మిలియన్‌ కిలోలు కాగా ఈ ఏడాది 94.21 మిలియన్‌ కిలోల పొగాకు దిగుబడి వచ్చినట్లు పొగాకు బోర్డు అంచనాకు వచ్చింది.

గతేడాది తీవ్ర వర్షాభావంతో అధిక వ్యయాన్ని భరించి మరీ పొగాకు సాగు చేస్తే ఒక్కో బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు మేర రైతులకు నష్టం వాటిల్లింది. గతేడాది అత్యధికంగా కిలోకు రూ.167.75 వచ్చింది. ఈ ఏడాది ఈ మొత్తానికి పది శాతం కలిపి ప్రారంభ ధర కిలోకు రూ.184గా నిర్ణయించాలని వ్యాపారులను రైతులు వేడుకొన్నారు. దీనికి ఒప్పుకున్న వ్యాపారులు చివరకు వేలం కేంద్రంలోకి వచ్చేసరికి ధరను తగ్గించడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పొగాకు బోర్డు నాణ్యమైన ఎఫ్‌–1 పొగాకుకు ప్రారంభ ధరను కిలోకు రూ.190గా నిర్ణయించింది. అయితే వ్యాపారులు రూ.170 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

వ్యాపారుల సిండికేట్‌..
చైనా అధికారుల బృందం దేశంలో పర్యటించడంతో పొగాకు కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారుల్లో పోటీ పెరుగుతుందని రైతులు భావించారు. కోవిడ్‌ దెబ్బతో చైనా ఈ వైపు కన్నెత్తి చూడడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే అదునుగా తీసుకున్న ఇండియన్‌ టుబాకో అసోసియేషన్‌ తన పెత్తనాన్ని పొగాకు వేలంలో సాగించింది. అన్ని పొగాకు వ్యాపార సంస్థలు కలిసి ఇండియన్‌ టుబాకో అసోసియేషన్‌గా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. రైతులతో, పొగాకు బోర్డుతో చేసుకున్న ఒప్పందాలను వ్యాపారులు లెక్క చేయడం లేదు. వేలం కేంద్రాల్లో వ్యాపారులు పొగాకు బేళ్లను తిరస్కరిస్తుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేలం జరుగుతున్న ఆరు కేంద్రాల్లో శనివారం రైతులు 635 బేళ్లను తీసుకురాగా 150 బేళ్లను కొనుగోలు చేయకుండా తిరస్కరించారు.

పూర్తి స్థాయిలో వ్యాపారులు పాల్గొనలేదు
రెండు జిల్లాల్లో మొదటి విడతగా ఆరు కేంద్రాల్లో వ్యాపారులు కొనుగోళ్లు ప్రారంభించారు. బోర్డులో రిజిస్టర్‌ చేసుకున్న వ్యాపారులందరూ వేలంలో పాల్గొనడం లేదు. దీంతో వేలం కేంద్రాలకు వచ్చిన అన్ని బేళ్లను కొనుగోలు చేయటం లేదు. దీంతో మిగిలిన బేళ్లను వెనక్కు తీసుకుపోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్‌లో చైనా వ్యాపారులెవరూ రాలేదు. 
 – జి.ఉమామహేశ్వరరావు, పొగాకు బోర్డ్‌ ఆర్‌ఎం (ఎస్‌బీఎస్‌)

నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి
చైనా బృందం రాష్ట్రంలో పర్యటించినప్పుడు పొగాకుకు మంచి ధర వస్తుందనుకున్నాం. అయితే ఇంతలో కోవిడ్‌ దెబ్బ మన పొగాకు వ్యాపారంపై తీవ్రంగా పడింది. దీంతో ఇక్కడి వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది.          
 – మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top