పట్టణాలకే పరిమితమైన కరోనా

Coronavirus Active In Towns At Kadapa District - Sakshi

సాక్షి, కడప: జిల్లాలో కరోనా పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాలలో కరోనా పాజిటివ్‌ కేసులు లేకపోవడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గ కేంద్రాలలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల, పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె, కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె, చెన్నూరులలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మొత్తంగా జిల్లాలో కడపతోపాటు కలిపి 51 మండలాలు ఉండగా, కడప, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఎర్రగుంట్ల, బద్వేలు, పులివెందుల, వేంపల్లె,  కమలాపురం, సీకే దిన్నె, చెన్నూరు, మైదుకూరు 11 మండలాలలో ఇప్పటివరకు 62 కరోనా  పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వీటిలో అత్యధికంగా ప్రొద్దుటూరులో 26, ఎర్రగుంట్లలో 11 కేసులు చొప్పున మొత్తం 37 కేసులు నమోదు కావడం గమనార్హం. మిగిలిన అన్నిచోట్ల కలిపి 25 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

గ్రీన్‌ జోన్లుగా 40 మండలాలు
రాజంపేట,  రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల పరిధిలో 17 మండలాలుగా  ఉండగా ఏ ఒక్క మండలంలో కూడా కరోనా కేసు నమోదు కాలేదు. వీటితోపాటు బద్వేలు నియోజకవర్గంలో ఆరు, జమ్మలమడుగులో ఐదు, కమలాపురంలో మూడు, మైదుకూరులో నాలుగు, పులివెందులలో ఐదు మండలాలు చొప్పున జిల్లాలో మొత్తం 40 మండలాల్లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. వీటిని గ్రీన్‌ జోన్స్‌గా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 50 మండలాలు ఉండగా 40 మండలాలు గ్రీన్‌ జోన్‌లో ఉండడంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ప్రభుత్వం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. కరోనా వైరస్‌ కట్టడి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రొద్దుటూరు, కడప, ఎర్రగుంట్ల, బద్వేలు, కమలాపురం, సీకే దిన్నెతో  కలిపి మొత్తం ఆరు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. కొత్తగా పాజిటివ్‌ కేసు బయటపడిన చెన్నూరును రెడ్‌జోన్‌గా ప్రకటించాల్సి ఉంది.గత 14 రోజులుగా  కొత్త కేసులు నమోదు కాని పులివెందుల, వేంపల్లె, మైదుకూరులను  ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటించారు. రెడ్, ఆరెంజ్‌ జోన్లు ప్రాంతాలలో ప్రజలు బయటికి రాకుండా చూస్తున్నారు. నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు.

ప్రధానంగా ప్రొద్దుటూరు, ఎర్రగుంట్లలలో అత్యధికంగా త్రోట్‌ శ్యాంపిల్స్‌ సేకరిస్తున్నారు. రోజుకు 500కు తగ్గకుండా రిజల్ట్స్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ట్రూనాట్‌ ల్యాబ్‌ల ద్వారా మరిన్ని శ్యాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 62 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా కోవిడ్‌ ఆస్పత్రి నుంచి 28 మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారు కోలుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top