కోవిడ్‌పై భయం వద్దు | Corona Virus: AP Govt takes precautions to control the Covid-19 | Sakshi
Sakshi News home page

కోవిడ్‌పై భయం వద్దు

Mar 14 2020 4:01 AM | Updated on Mar 14 2020 8:12 AM

Corona Virus: AP Govt takes precautions to control the Covid-19 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోందని.. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి సూచించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన వారు విదేశాల నుంచి వచ్చినప్పుడు వారిని 14 రోజులపాటు నిర్బంధంలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కోవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాకు వివరించారు. నెల్లూరుకు చెందిన వ్యక్తికి కోవిడ్‌ సోకినట్టు స్పష్టమవడంతో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మీడియాకు జవహర్‌రెడ్డి వెల్లడించిన మరిన్ని అంశాలు..
- ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించేందుకు రాష్ట్రంలో కోటి 40 లక్షల కుటుంబాల సర్వే చేపట్టాం. ఇప్పటికే 89 వేల కుటుంబాల సర్వేను పూర్తి చేశాం. 
దాదాపు 3 వేల మంది వరకు విదేశాలకు వెళ్లి వచ్చినట్టు గుర్తించాం. 
గుర్తించిన వారికి కోవిడ్‌ లక్షణాలేమైనా ఉన్నాయో, లేదో పరిశీలించి వారు 14 రోజులపాటు ఇంటిలోనే ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు సహా ఎవరినీ కలవకుండా ముందు జాగ్రత్త చర్యలు సూచించాం. 
- వారు తినే ఆహారం, వాడే వస్తువులు, తదితరాలను వారే డిస్పోజ్‌ చేసుకోవాలని వివరించాం. 
- ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే 104కు ఫోన్‌ చేసి డాక్టర్‌ను సంప్రదించాలని సూచించాం.
- కోవిడ్‌ పరీక్షల నిర్ధారణ కోసం తిరుపతిలోని స్విమ్స్, విజయవాడలో ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. మరో వారంలో కాకినాడలో కూడా ల్యాబ్‌ అందుబాటులోకి వస్తుంది.


తిరుపతి, విశాఖలో క్వారంటైన్‌ కేంద్రాలు
- రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 56 ఐసోలేషన్‌ వార్డులు, 428 ప్రత్యేక పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం.
జిల్లాకు ఒకటి చొప్పున 13 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీములను, 13 అంబులెన్సులను అందుబాటులో ఉంచాం. 
- ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతిలో 500 పడకలతో, విశాఖపట్నంలో 200 పడకలతో క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం.
- ఇప్పటివరకు 55 మంది శాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం పూణేలోని ల్యాబ్‌కు పంపగా వాటిలో 47 నెగెటివ్‌గా వచ్చాయి. నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్‌ రాగా, మరో 7 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
- విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప  విమానాశ్రయాలు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణ్ణపట్నం ఓడరేవుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం.
- రాష్ట్ర స్థాయిలో 0866–2410978 నంబరుతో 24 గంటలూ పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశాం. 
విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరినీ కలవద్దు
- విదేశాల నుంచి వచ్చిన వారు కొంతకాలం పాటు తమ బంధువులను, స్నేహితులను కలవడం చేయొద్దు.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం చేయొద్దు. దగ్గు, తుమ్ము వస్తే చేతి రుమాలును అడ్డుపెట్టుకోవాలి.
- తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement