తల్లి.. బిడ్డలు.. మధ్య కరోనా!

Corona Effect Divided Mother And Child - Sakshi

ఎడబాటుతో తల్లడిల్లిపోతున్న ఏడు నెలల కవలలు

వీసా రెన్యూవల్‌కు వెళ్లి మలేషియాలో చిక్కుకున్న తల్లి

విమాన సర్వీసుల రద్దుతో  తిరిగి రాలేక అవస్థలు

అమ్మ కోసం పసికందుల ఆక్రందన

భారత ఎంబసీని సంప్రదించినా స్పందన శూన్యం

సాక్షికి తన గోడు వెళ్లబోసుకున్న సింధూష

 రాష్ట్రం, కేంద్రం సహకరించాలని విన్నపం

వారిద్దరూ కవలలు.. పైగా ఏడు నెలల పసికందులు.. అమ్మ ఒడే లోకంగా బోసి నవ్వులు చిందించా. తల్లి పరిష్వంగంలో పరవశించిపోవాలి్సన ఆ బిడ్డలు కొన్ని రోజులుగా అమ్మ స్పర్శకే నోచుకోక అల్లాడిపోతున్నారు.  బిడ్డలను పొత్తిళ్లలో పొదువుకొని తన్మయం చెందాల్సిన ఆ తల్లేమో దేశం కాని దేశంలో బిడ్డల దరి చేరే మార్గం కానరాక తల్లడిల్లుతోంది.  ఈ తల్లీబిడ్డల ఎడబాటుకు కారణం.. కరోనా! వీసా రెన్యూవల్‌ కోసం మలేషియా వెళ్లిన ఆమె.. కరోనా నియంత్రణలో భాగంగా ఆ దేశం విధించిన ట్రావెల్‌ బ్యాన్‌తో అక్కడే చిక్కుకుపోయి.. తనను స్వదేశం పంపించేయాలని కోరుతూ భారత ఎంబసీ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అక్కడివారెవరూ తన గోడు వినిపించుకోకపోవడంతో ఫోన్‌లో ‘సాక్షి’ తన పరిస్థితిని వివరించింది. కన్నబిడ్డల కోసం పరితపిస్తున్న ఆ తల్లి విశాఖకు చెందిన సింధూష. 

విశాఖపట్నం: నగరంలోని శివాజీపాలెం ప్రాంతానికి చెందిన సింధూషకు, విజయ్‌చంద్రతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. విజయ్‌ మలేషియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వివాహమైన తరువాత దంపతులిద్దరూ అక్కడే ఉంటున్నారు. గత ఏడాది సింధూష డెలివరీ కోసం విశాఖలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఏడు నెలల క్రితం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇటీవల ఆమె వీసా గడువు దగ్గరపడింది. అదే సమయంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. వీసా రెన్యూవల్‌ చేయించుకోకపోతే భర్త దగ్గరకు వెళ్లడానికి కుదరదు. పైగా విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం లేకపోవడంతో సింధూష ధైర్యం చేసి రెండు వారాల క్రితం మలేషియా వెళ్లింది. వీసా రెన్యూవల్‌ చేయించుకుంది.

పని పూర్తి చేసుకొని విశాఖకు తిరుగు ప్రయాణమయ్యే సమయానికి పరిస్థితి మారిపోయింది. కరోనా వైరస్‌ మరింత విజృంభించడంతో మలేషియా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.  అందులో భాగంగా ట్రావెల్‌ బ్యాన్‌ విధించి.. మలేషియా నుంచి విదేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో సింధూష అక్కడే చిక్కుకుపోయింది. ఏడు నెలల పసికందులైన తన పిల్లలను చూడాలని పరితపిస్తూ అక్కడ భారత ఎంబసీ చుట్టూ తిరుగుతుంటే.. ఇక్కడ పిల్లలు తల్లి ప్రేమకు నోచుకోలేకపోతున్నారు. సింధూష కౌలాలంపూర్‌లోని ఇండియన్‌ హైకమిషన్‌ కార్యాలయానికి వెళ్లి తన పరిస్థితి వివరించినప్పటికీ.. అక్కడ ఎవరూ స్పందించకపోవడంతో ఆమె తన గోడును అక్కడ నుంచి “సాక్షి’కి వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన బాధను అర్థం చేసుకొని మలేషియా నుంచి తనను విశాఖకు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతోంది

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top