Sakshi News home page

బ్యాంక్ ఎదుట కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన

Published Fri, Apr 4 2014 12:59 AM

contract lecturer concern

కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఆరు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్న తమకు బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరోసారీ నిరాశ ఎదురైందని కాంట్రాక్ట్ లెక్చరర్లు వాపోయారు. బ్యాంక్ అధికారుల వైఖరిని నిరసిస్తూ గురువారం వారు రాజమండ్రి లోని ఇన్నీసుపేట స్టేట్‌బ్యాంక్ శాఖ ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 38 ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఆరు నెలలుగా జీతాలు అందడంలేదు.
 
దీంతో వారు పలు ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక నెల జీతాలను ప్రభుత్వం బ్యాంక్ డీడీల రూపంలో విడుదల చేశారు. ఈ సొమ్ము తీసుకునేందుకు డీడీలతో ఇన్నీసుపేట స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇన్నీసుపేట బ్రాంచ్)కు వెళ్లిన 47 మంది కాంట్రాక్ట్ లెక్చర ర్లకు చుక్కెదురైంది. ఈ డీడీలు తప్పులతో జారీ అయ్యాయని, ఇవి చెల్లవని బ్యాంక్ అధికారులు తిరస్కరించారు. ఆరు నెలలుగా అప్పులతో బతుకీడుస్తున్న తాము ఒక్కనెల జీతమైనా వస్తుందని ఆశతో వస్తే తప్పుడు డీడీలతో మోసం చేశారని కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
 
గోకవరం కళాశాలకు సంబంధించిన డీడీని కోరుకొండ అడ్రస్‌తో, కాకినాడ కళాశాల డీడీని సామర్లకోట అడ్రస్‌తో ఇచ్చారని వాపోయారు. జూనియర్ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు రాజాచౌదరి, ఇతర జిల్లా యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. బ్యాంక్ సిబ్బందిని లెక్చరర్లు నిలదీశారు. 47 డీడీల లోని తప్పులను సవరించి మళ్లీ జారీ చేస్తామని బ్యాంకు సిబ్బంది సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement