తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు : కిషన్‌రెడ్డి | congress will loose grip in telangana : kishan reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు : కిషన్‌రెడ్డి

Oct 5 2013 3:35 AM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు : కిషన్‌రెడ్డి - Sakshi

తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు : కిషన్‌రెడ్డి

వందలాది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి నవ తెలంగాణలోనూ ఓటమి తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

 సాక్షి, హైదరాబాద్: వందలాది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి నవ తెలంగాణలోనూ ఓటమి తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నాన్చి నాన్చి ఇంతకాలానికి తెలంగాణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించరన్నారు. రహస్య ఎజెండాలతోనే ఇతర రాజకీయ పార్టీలు సీమాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ తీర్మానం ఆమోదం తర్వాత శుక్రవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం పార్టీ నేతలతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రులకు మరింత లాభమన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత కూడా తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడాన్ని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. సీఎంకు పదవి కావాలో ఉద్యమం కావాలో తేల్చుకోవాలన్నారు.
 
  తెలంగాణలో చావులకు సోనియా, చంద్రబాబులదే బాధ్యతన్నారు. త్వరలో పార్టీకి రెండు శాఖల్ని ఏర్పాటు చేస్తామని, వచ్చే ఎన్నికల్లో అమరవీరుల కుటుంబాలకు టికెట్లు ఇస్తామని చెప్పారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ నోట్‌ను ఆమోదించే ముందు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని పట్టించుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వరరావు మాట్లాడుతూ శనివారం జరిగే తెలంగాణ ప్రాంత పదాధికారుల భేటీలో భవిష్యత్ కార్యక్రమాన్ని ఖరారు చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ నేతలు మనోహర్‌రెడ్డి, ప్రభాకర్, అశోక్‌కుమార్ యాదవ్, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన వారలో కిషన్‌రెడ్డితో పాటు బద్దం బాల్‌రెడ్డి, చింతాసాంబమూర్తి, డాక్టర్ మల్లారెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement