డబ్బులిస్తాం రండి.. | Congress party was subsiding | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తాం రండి..

Mar 13 2014 2:46 AM | Updated on Aug 29 2018 5:50 PM

జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

సాక్షి, అనంతపురం : జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆఖరుకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి వద్దకు నేరుగా నాయకులే వెళ్లి కాంగ్రెస్ తరఫున బీఫారం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నా వారి నుంచి స్పష్టమైన హామీ రావడం లేదు.
 
 ఇందులో భాగంగానే అనంతపురం నగరంలో 35 డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసి.. వారందరూ కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఒప్పుకున్నారని మంగళవారం సాయంత్రం నేతలకు సమాచారం ఇచ్చారు. ఆ 35 మంది బుధవారం నామినేషన్లు వేసినా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అందులో సగం మంది కూడా ఒప్పుకోకపోవడంతో నాయకుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో పరువు నిలవాలంటే అన్ని చోట్లా అభ్యర్థులను రంగంలో దింపాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు రంగంలో వుండాల్సిందేనంటూ తన అనుచరవర్గానికి రఘువీరారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
 
 జిల్లా కేంద్రంలో అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టంగా మారడంతో ఏం చేయాలో దిక్కుతోచక నాయకులు తలలు బాదుకుంటున్నారు. జిల్లాలో అనంతపురం నగర పాలక సంస్థతో పాటు హిందూపురం, ధర్మవరం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, మడకశిర, పామిడి, గుత్తి మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నామినేషన్లు వేసేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆ లోపు అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టంగా మారిందని ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత వాపోయారు.
 
 ఇప్పటి వరకు రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన మడకశిర మున్సిపాలిటీలో మాత్రమే అన్ని వార్డులకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. మిగిలిన 10 మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. మడకశిర మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారందరికీ తానే ఖర్చు భరిస్తానని రఘువీరారెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. కదిరి మున్సిపాలిటీలో బుధవారం నాటికి కాంగ్రెస్ తరఫున ఒక వార్డుకు మాత్రమే నామినేషన్ వేశారు. హిందూపురంలో నాయకులకు ఏదో ఒక ఆశ చూపి కనీసం కొన్ని వార్డుల్లోనైనా అభ్యర్థులను పోటీ చేయించాలనే ఉద్దేశంతో రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్షుని హోదాలో మొదటి సారిగా పట్టణంలో పర్యటించి ఒక్కో నాయకున్ని పిలిపించి మాట్లాడారు.

అయినా అక్కడ ఆశించిన స్థాయిలో స్పందన కన్పించకపోవడంతో దిక్కు తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గెలుపు ఓటములను పక్కన పెట్టి కనీసం అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను మాత్రం ఎంపిక చేయాలంటూ ఒత్తిళ్లు వస్తుండటంతో నాయకులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి నెలకొంది. పోటీ చేసేందుకు రండి బాబూ రండి... ఖర్చు అంతా తామే భరిస్తామని హామీ ఇస్తున్నా నమ్మడం లేదు.
 
 అనంతపురంలో ఇద్దరు ముగ్గురు మాత్రం ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని నేరుగా తమకు ఇస్తామంటేనే పోటీ చేస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది. పదవులను అడ్డం పెట్టుకొని నాయకులు ఇన్నాళ్లూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకుంటూ కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల పుణ్యమా అంటూ తమ వద్దకు వస్తారా అంటూ పలువురు నాయకులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో మిగిలిన మున్సిపాలిటీల పరిస్థితి ఏమిటో గాని అనంతపురం జిల్లాలో మాత్రం మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులకు అభ్యర్థులను పోటీ చేయించి పరువు నిలపాలని నేతలను బుజ్జగిస్తున్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement