నిజాయతీ చాటిన బస్‌ కండక్టర్, డ్రైవర్‌

Conductor And Driver Return To Cash Bag In Guntur - Sakshi

గుంటూరు: బస్సులో కాష్‌బ్యాగ్‌ మర్చిపోయిన బాధితులకు ఆర్టీసీ బస్‌ కండక్టర్, డ్రైవర్‌ కాష్‌బ్యాగ్‌ను అందజేసి నిజాయతీ చాటుకున్నారు. ఈ సంఘటన మంగళగిరి పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. మంగళగిరి డిపో మేనేజర్‌ విజయకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం పిడుగురాళ్ల సమీపంలో ఇనుమట్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ మంగళవారం గుంటూరులో ఆర్టీసీ బస్టాండ్‌లో బస్‌ ఎక్కి విజయవాడలో ఉన్న తన  కుమారుడి వద్దకు బయల్దేరాడు. ఈ క్రమంలో విజయవాడ ఐస్‌ఫ్యాక్టరీ దగ్గర బస్‌ దిగి కొంత దూరం వెళ్లిన తర్వాత తనతో పాటు తెచ్చుకున్న రూ.78వేల కాష్‌బ్యాగ్‌ బస్సులో వదిలివేసినట్లు గుర్తించాడు. హుటాహుటిన విజయవాడ బస్టాండ్‌కు వెళ్లి అక్కడ ఆర్టీసీ అధికారులను విచారించగా, ఆ బస్సు మంగళగిరి డిపోకు చెందినదిగా తెలుసుకుని, మంగళగిరి చేరుకున్నాడు.

జరిగిన విషయాన్ని మంగళగిరి డిపో మేనేజర్‌కు బాధితుడు వివరించారు. అయితే అప్పటికే  బస్‌ కండక్టర్‌ కె.పద్మ, డ్రైవర్‌ ఏ.డిల్లీరావులు బస్సులో మర్చిపోయిన క్యాష్‌ బ్యాగ్‌ వివరాలను తనకు తెలిపినట్లు డిపో మేనేజర్‌ విజయ్‌కుమార్‌ వెల్లడించారు.. సత్యనారాయణను విచారించి ఆ కాష్‌బ్యాగ్‌ అతనిదే అని నిర్థారించి ప్రయాణీకుల సమక్షంలో ఆయనకు డిపో మేనేజర్‌  బ్యాగ్‌ అందజేశారు. విధి నిర్వహణలో నిబద్ధత పాటించి, నిజాయతీగా వ్యవహరించిన బస్‌ కండక్టర్, డ్రైవర్‌లను డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది, తదితరులు అభినందించారు.  ఆర్టీసీ అధికారులకు, బస్‌ కండక్టర్, డ్రైవర్‌లకు బాధితుడు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top