కంప్యూటర్‌ విద్య.. మిథ్య

Computer teachers shortage in government collages - Sakshi

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల దుస్థితి

జిల్లాలో రెండుకళాశాలల్లోనే కంప్యూటర్‌అధ్యాపకులు

ఒక విద్యాలయం గొప్పతనం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిపై ఆధారపడి ఉంటుందే గానీగొప్ప భవనాలను బట్టి కాదని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చెప్పిన మాటలు నేడు
వ్యతిరేకార్థంలో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలకు పెద్ద పెద్ద భవనాలు నిర్మించినా వాటిలో చదివేవిద్యార్థులకు బోధించేందుకు అధ్యాపకులను నియమించడంలేదు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్‌ అధ్యాపకులు లేకుండానే ఆ కోర్సులు పూర్తి చేయాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడింది.

తణుకు టౌన్‌ : దేశంలో, రాష్ట్రంలో కంప్యూటర్‌ వ్యవస్థను తానే ప్రవేశపెట్టినట్టు గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ కళాశాలల్లో కంప్యూటర్‌ విద్యకు సంబంధించిన అధ్యాపకులను నియమించకపోవడం దారుణం. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరిన డిగ్రీ విద్యార్థులు అధ్యాపకులు లేకుండానే తమ కంప్యూటర్‌ విద్యను కొనసాగిస్తున్నారు. ప్రతి పని కంప్యూటర్‌ ఆధారంగా జరగాలని కోరుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్‌ నైపుణ్యాలు బోధించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలనే ఆలోచన ఇప్పటికీ కలగపోవడం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు చేసుకున్న పాపమేమో! అని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఒక అటానమస్‌ కాలేజ్, ఆరు ప్రభుత్వ పెద్ద కళాశాలలు, మరో 15 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వుండగా వాటిలో డిగ్రీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం కలిపి సుమారు 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.

వీరందరికీ మిగిలిన సబ్జెక్టుల మాదిరిగానే కంప్యూటర్‌ సైన్స్‌కు సంబంధించిన రెగ్యులర్‌ అధ్యాపకులు ఉండాలి. కానీ జిల్లాలోని మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రమే కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకులున్నారు. అదీ కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. మిగిలిన కళాశాలల్లో అసలు కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకులే లేకుండా విద్యార్థులు తమ చదువులు కానిచ్చేస్తున్నారు. డిగ్రీలో కంప్యూటర్‌ కోర్సుకు సంబంధించి విద్యార్థి నుంచి రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకూ ఫీజులు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం, రూ.7,500 వరకూ వసూలు చేసుకోవచ్చని యూనివర్సిటీలు ఆదేశిస్తున్నాయి.

ఫీజులు వసూలు చేసుకోవచ్చని ఆదేశించిన ప్రభుత్వం విద్యార్థులకు కావలసి బోధన సిబ్బందిని నియమించాలనే విషయం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్‌ అధ్యాపకులను నియమించకపోవడంతో కంప్యూటర్‌ విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులు ఫీజులు భారమైనా ప్రైవేట్‌ కళాశాలల్లో చేరుతున్నారు. కళాశాలల్లో కంప్యూటర్‌ విద్యాబోధనకు అధ్యాపకులను నియమించని ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి కళాశాలల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌ల పేరుతో ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కంప్యూటర్‌లు ల్యాబ్‌ల్లో భద్రంగా ఉంటున్నాయేగానీ అవి విద్యార్థులకు ఉపయోగపడటం లేదు.

అధ్యాపకులను నియమించకపోవడం బాధాకరం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌కు సంబంధించిన అధ్యాపకులను నియమించకపోవడం బాధాకరం. 30 ఏళ్ల క్రితమే రాష్ట్రంలో మొదటిసారిగా పెనుగొండ కళాశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌తో, అధ్యాపకులతో బీఎస్సీ కంప్యూటర్‌ కోర్సును ప్రారంభించాం. దీంతో ప్రైవేట్‌ కంప్యూటర్‌ సంస్థలతో పోటీగా అక్కడ విద్యార్థులు కంప్యూటర్‌ రంగంలో రాణించారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్‌ కోర్సుకు సంబంధించి ఆధునిక సదుపాయాలు ఎన్ని కల్పించినా అవి అధ్యాపకుడు లేకుండా పరిపూర్ణం కావు.
– డాక్టర్‌ గుబ్బల తమ్మయ్య, రిటైర్డ్‌ ప్రిన్సిపల్, తణుకు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top