సత్యదేవా.. పోస్టులకు రూ.లక్షలా! 

Complaints Received On Recruitment Of Priests In Annavaram Temple - Sakshi

 సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహిత పోస్టుల భర్తీ, పదోన్నతుల విషయంలో రూ. లక్షలు చేతులు మారుతున్నాయని దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. పదోన్నతులకు రూ.50 వేలు, వ్రత పురోహిత పోస్టుకు రూ.3 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదు.. దేవస్థానంలో కలకలం సృష్టించింది. కోర్టు తీర్పు ప్రకారం 13 మంది పురోహితులను ఇటీవల ఈఓ ఎంవీ సురేష్‌బాబు నియమించారు. గతేడాది డిసెంబర్‌లో 20 మందికి ఇచ్చిన పదోన్నతులు వివిధ కారణాల వల్ల అమలు కాలేదు. దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు వీరికి పదోన్నతులు కల్పించారు.

ఈ పదోన్నతులతో బాటు గతంలో ఖాళీ ఏర్పడిన 30 రెండో తరగతి వ్రత పురోహితుల పోస్టులతోపాటు ఖాళీగా ఉన్న 36 మూడో తరగతి వ్రత పురోహితుల పోస్టుల భర్తీ చేయడానికి కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ఈ పదోన్నతులపైనే వివాదం ఏర్పడింది. మొత్తం 80 మంది మూడో తరగతి పురోహితులు పదోన్నతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు సీనియర్లకే పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది జూనియర్‌ వ్రత పురోహితులు కూడా పదోన్నతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా భర్తీ చేసే వ్రత పురోహితుల పోస్టులకు కూడా గట్టి పోటీ ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు.. ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.  

ఈఓగా ఆర్‌జేసీ వస్తారంటూ ప్రచారం 
ఇదిలా ఉండగా, దేవస్థానం ఈఓగా తిరిగి ఆర్‌జేసీ వి.త్రినాథరావు నియమితులవుతారన్న ప్రచారం సాగుతోంది. ఒకటి రెండ్రోజుల్లో ఆయనను నియమిస్తూ ఆదేశాలు వెలువడుతాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుత ఈఓ సురేష్‌బాబు ఈ పదోన్నతులు, నియామకాలు చేపట్టాలని తొందర పడుతున్నారని కొంతమంది ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

కొత్తగా పోస్టులు, పదోన్నతులు భర్తీ చేయడంలేదు 
కోర్టు తీర్పు ప్రకారం 13 మంది పురోహితులను నియమించడం, కమిషనర్‌ ఆదేశాల మేరకు గత డిసెంబర్‌లో ఇచ్చిన పురోహితుల పదోన్నతులను మాత్రమే అమలు చేయనున్నట్టు దేవస్థానం ఈఓ సురేష్‌బాబు తెలిపారు. కొత్తగా పదోన్నతులు, పోస్టుల భర్తీ చేయడం లేదని గురువారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు. పదోన్నతులకు రూ.50 వేలు, పోస్టుకు రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారన్నది వట్టి ప్రచారం మాత్రమేనని, అందులో వాస్తవం లేదని ఆయన అన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top