
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్ వి.విజయరామరాజు, చిత్రంలో సబ్‌కలెక్టర్, అదనపు కమిషనర్
సాక్షి, రాజమహేంద్రవరం: ఈ తరం పిల్లలకు ఉగాది విశిష్టతను తెలియజేసేలా పండుగను నిర్వహించేందుకు నిర్ణయించామని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు ఉగాది ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీ (ఆదివారం) ఉగాది సందర్భంగా పుష్కరఘాట్ నుంచి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన ద్వారం వరకు ఫుట్‌ఫాత్‌పై స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పిల్లల ఆట బొమ్మలు, సంప్రదాయ వంటకాలు విక్రయించే వారికి ఈ స్టాల్స్‌ను ఉచితంగా కేటాయిస్తామని చెప్పారు.
జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన వంటకాలు విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉగాది ముందు రోజు (శనివారం) సాయంత్రం నుంచి ఉత్సవాలు మొదలవుతాయని, అప్పటి నుంచే స్టాల్స్ ద్వారా విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపారు. నంది నాటకోత్సవాల ప్రదర్శనకు అనుగుణంగా ఆనం కళాకేంద్రం పై అంతస్థులు, ఇతర ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి ఉన్న కళాకారులు గురువారం సాయంత్రంలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కవి సమ్మేళనాలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముగ్గుల పోటీలు, చిన్నారుల నుంచి మహిళలకు ‘తెలుగమ్మాయి’ పేరుతో మూడు కేటగిరీల్లో సంప్రదాయ దుస్తుల ధారణ పోటీలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తామని చెప్పారు. ఆదివారం సాయంత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం పుష్కరఘాట్ వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గో సంపద ప్రదర్శనకు ఆసక్తి గల వారు తమ గోవులను తీసుకురావచ్చని చెప్పారు. పోటీల్లో అందమైన ఆవులను ఎంపిక చేసి యజమానికి బహుమతులు ఇస్తామని తెలిపారు. ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని, చిన్నారులను భాగస్వాములను చేయాలని కోరారు. ఈ సమావేశంలో సబ్‌కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, అదనపు కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ రావు, మేనేజర్ సీహెచ్. శ్రీనివాసరావు పాల్గొన్నారు.