ఒకే గూటి పక్షులం


బుల్లి తెర, వెండి తెరపై నవ్వుల జల్లులు కురిపిస్తూ అఖిలాంధ్ర ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు ప్రముఖ హాస్య నటులు ధన్‌రాజ్, చంద్ర.     జై సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన వీరు పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ‘టోల్‌ఫ్రీ నంబర్..143’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు బుధవారం పోచంపల్లికి వచ్చిన సందర్భంగా తమ నట జీవితానుభవాలను ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు.

 - న్యూస్‌లైన్, భూదాన్‌పోచంపల్లి

 

 ధన్‌రాజ్ :  నాకు చిన్నప్పటి నుంచి సిని మాలన్నా, నటన అన్న చాలా పిచ్చి.  మెగాస్టార్ చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమా పోస్టర్ మా ఇంటి గోడకు అతికించారు. ఆ సినిమా హనుమాన్ జంక్షన్‌లోని ఓ థియేటర్‌లో ఏడాది పాటు ఆడింది. అయితే ఏడాదంతా వా రం వారం సినిమా పోస్టర్ అతికించేవారు. ప్రొద్దున లేస్తే నాకు ఇంటిముందు పోస్టర్ కనిపించేది. అప్పుడే నిర్ణయించుకున్న హైదరాబాద్‌కు వెళ్లి చిరంజీవిని కలిసి సినిమాలో వేషం ఇవ్వమని అడగాలని. వెంటనే హైదరాబాద్‌కు వచ్చేశాను. కాని ఇక్కడ పరిస్థితి నేననుకున్నట్లు లేదు. ఓ హోటల్‌లో సర్వర్‌గా చేరి సినీ అవకాశాల కోసం వెదకసాగాను.

 

 పేపరు ప్రకటన చూసి..

 పన్నెండేళ్ల క్రితం సినిమాలో కొత్త నటీనటులు కావాలని ఓ రోజు పేపర్‌లో వచ్చిన ప్రకటన చూసి వెళ్లాను. దర్శకుడు తేజ ‘జై’ సినిమాలో మొదటిసారిగా అవకాశం కల్పించారు. ఆ తరువాత అడపదడపా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 60కి పైగా సిని మాల్లో నటించాను. జగడం, పరుగు, గోపి గోపిక గోదావరి, పిల్ల జమీందార్, భీమిలి కబడ్డీ జ ట్టు, అడ్డా, దళం నాకు మంచి పేరు తెచ్చాయి. ఇ-సత్తిబాబు, జెండాపై కపిరాజుతో పాటు మరో ఐదారు సినిమాలో నటిస్తున్నాను. అత్తారింటికి దారేది రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.  నేను, తాగుబోతు రమేష్ కలిసి హీరోలుగా పయనం’అనే సినిమాలో నటిస్తున్నాము. కామెడీ చేయడంతో ఎంత ఇష్టమో, సందేశం ఇచ్చే సినిమాలు చేయాలనేది అంతే ఇష్టం.

 

 జీవిత లక్ష్యం..

 ప్రముఖ హాస్యనటులు అలీ, రాజేంద్రప్రసాద్‌లు అంటే చాలా ఇష్టం. చిరంజీవి వలె పేరు, అలీ అంతా మంచితనం, రాజేంద్రప్రసాద్ వలె యాక్టింగ్ చేయాలన్నదే జీవిత లక్ష్యం.

 

 గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు..

 చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్లు లేరు. అందుకే నేను చంద్ర, వేణు అందరం కలిసి చాలా ఫ్రెండ్లీగా, అన్నదమ్ములుగా కలిసి ఉంటాం. అవకాశం ఉంటే నా స్నేహితులకు అవకాశం కల్పించమని అడుగుతాను. ఈ నెల 18  నుంచి చెన్నెలో జరిగే వందేళ్ల తెలుగు చిత్రపరిశ్రమలో స్టేజి ప్రోగ్రామ్ చేయడానికి నాకు, చంద్ర, వేణులకు అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్‌కల్యాణ్ లాంటి ప్రముఖ నటులు హాజరవుతున్నారు. వారందరి ముందు మా టాలెంట్ నిరుపించుకుంటాం.

 

 నా మొదటి  సినిమా ‘జై’..

 చంద్ర : నాకు  చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. కోట శ్రీనివాస్‌రావు, బాబుమోహన్, అలీ, వేణుమాదవ్ నటించిన సినిమాలు బాగా చూసేవాడిని. నేను కూడా పేపరు ప్రకటన చూసి వెళ్లి ‘జై’ సినిమాకు ఎంపికయ్యాను. అదే సిని మాకు ధన్‌రాజ్ కూడా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి మేమిద్దం మంచి స్నేహితులుగా మారాం. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తాడు. సినిమాల్లో కూడా కొన్ని పాత్రలకు అవకాశం కల్పించాడు. ఇప్పటి వరకు 30 సినిమాల్లో నటించాను. కాని తగిన గుర్తింపు మాత్రం రాలేదు.

 

 అభిమానం బూస్ట్‌లాంటి..

 ప్రజలు చూపిస్తున్న అభిమానం బూస్ట్‌లా పనిచేస్తుం ది. బుల్లి తెరపై మేము పండిస్తున్న హాస్యాన్ని చూసిన తర్వాత పెద్ద పెద్ద సనిమాల్లో మంచి అవకాశాలొస్తున్నాయి. కొన్ని సినిమాల్లో మా కోసం పాత్రలను సృష్టిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, గబ్బర్‌సింగ్-2తో పాటు ఐదారు పెద్ద సినిమాలలో నటిస్తున్నాను.

 

 నిరుత్సాహం వద్దు..

 టాలెంట్ ఉంటే అవకాశాలకు కొదవలేదు. నిరుత్సాహ పడవద్దు, ఓపిక కూడా అవసరం. ప్రస్తుతం సినిమా నిర్మాణాలు పెరిగాయి. అదేస్థాయిలో అవకాశాలు పెరిగి కొత్తకొత్త వారికి నటించే అవకావాలొస్తున్నాయి. ఇది శుభపరిణామం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top