ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? 

Collector Cancelled Meeting on Road Safety Due to Officers Absent - Sakshi

హైవే అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

ఇదే కొనసాగితే పీడీలపై క్రిమినల్‌ కేసులు 

రహదారి భద్రత కమిటీ సమావేశానికి గైర్హాజరు కావడంపై మండిపాటు 

కర్నూలు(అగ్రికల్చర్‌): ‘జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోతు న్నా పట్టించుకోరు.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోరు.. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా?’ అంటూ నేషనల్‌ హైవే అధికారులపై కలెక్టర్‌ వీరపాండియన్‌ నిప్పులు చెరిగారు. హైవేలపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మంగళవారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో కలెక్టర్‌.. రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.  గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు తీసుకున్న చర్యలపై వివరాలు కోరగా సంబంధిత హైవే అథారిటీ అధికారులు రాలేదని వెల్లడి కావడంతో కలెక్టర్‌ మండిపడ్డారు. ఎన్‌హెచ్‌ –44, 40 పీడీలు రవీంద్ర రావు, చంద్రశేఖర్‌రెడ్డి గైర్హాజరు కావడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.  రహదారి భద్రత కమిటీ సమావేశం ఉన్నపుడే మీకు ఇతర సమావేశాలుంటాయా? ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అంటూ విరుచుకుపడ్డారు. ప్రతి మీటింగ్‌కూ ఇలాగే చేస్తున్నారని పేర్కొన్న కలెక్టర్‌.. గతంలో వీరు ఏఏ సమావేశాలకు హాజరు కాలేదో వివరాలివ్వాలని రవాణా అధికారులను ఆదేశించారు.

‘ప్రమాదాలు జరుగుతు న్నా సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నివారణ చర్యలు తీసుకోవాలని రహదారి భద్రత కమిటీ ఆదేశించినప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది’ అంటూ ధ్వజమెత్తారు. ఇకపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోతే వారిపైనే క్రిమినల్‌ కేసులు పెడతామని స్పష్టం చేశా రు. ఎన్‌హెచ్‌– 40, 44 అభివృద్ధి, మరమ్మతు పనులకు ఇసుక, విద్యుత్‌ సరఫరా నిలిపేయాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల స్థానంలో వచ్చిన కిందిస్థాయి అధికారులను బయటకు వెళ్లాలని ఆదేశించారు. ‘ఇటీవలే వెల్దుర్తి వద్ద ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యా యి. చర్చించి చర్యలు తీసుకుందామంటే నిర్లక్ష్యం పేరుకుపోయింది’ అంటూ మండిపడ్డారు.  వారు వచ్చిన తర్వాతే సమావేశం నిర్వహిస్తామంటూ అర్ధాంతరంగా ముగించారు. ఎస్పీ పక్కీరప్ప, ఇన్‌చార్జ్‌ డీటీసీ కృష్ణారావు, ఆర్డీఓ  పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top