నవశకానికి దిశానిర్దేశం 

CM YS Jagan Mohan Reddy First Meeting With District Collectors - Sakshi

 నేడు అమరావతిలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న సీఎం

 నవరత్నాల అమలుపైనా... సీజనల్‌ కండిషన్‌పైనా సమీక్ష 

 దానికి తగ్గట్టుగా జిల్లా సమాచారంతో పయనమైన కలెక్టర్‌

 ముఖ్యమంత్రి సూచనలతో జిల్లాలో ఊపందుకోనున్న పాలన

సాక్షి, విజయనగరం : అమరావతిలో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించి అజెండాను ప్రభుత్వం రెండురోజుల క్రితమే ఖరారు చేసింది. ఈ సదస్సులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నవరత్నాలపై చర్చకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో ఉన్న పలు పథకాల అమలు గురించి అజెండాలో చేర్చా రు. వీటితోపాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యలపైనా దృష్టిసారించారు. ముఖ్యంగా ఎనిమిది అంశాలపై ఫోకస్‌ చేశారు. అందులో మొదటిది గ్రామ సచివాలయ వ్యవస్థ.

ఆక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వ్యవస్థతోపాటు ఆగస్టు 15వ తేదీ నుంచి విధుల్లోకి రానున్న గ్రామ వలంటీర్ల గురించి చర్చించాలని నిర్ణయించారు. ఆరో గ్యశ్రీ పథకం అమలు, 108, 104 సేవలు రెండో ప్రాధాన్యత అంశంగా చేర్పించారు. సెప్టెంబర్‌ నెల నుంచి ఇంటింటికి సరకులు పంపిణీ, సన్నబియ్యం పంపిణీ మూడో అంశంగా చేర్చారు. పాఠశాలల్లో పిల్లల నమో దు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ అంశం తర్వాత చర్చిస్తారు. కరువు, ప్రస్తుతం పంటలు సాగు పరిస్థితి, పశుగ్రాసం, తాగునీరు, విద్యుత్‌ సరఫరాపై సమీక్షిస్తారు.

వైఎస్సార్‌ భద్రతా
రాష్ట్రంలో జనరంజక పాలన మొదలైంది. వివిధ వర్గాలవారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయిలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటి అమలుపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. దానిపై ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందించారు. ఇక క్షేత్రస్థాయిలో అమలుకు అవసరమైన సూచనలు చేసేందుకు జిల్లా కలెక్టర్ల సదస్సు సోమవారం నిర్వహించనున్నారు. నవరత్నాల అమలుకు సంబంధించి... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అవసరమైన జిల్లా సమాచారంతో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అమరావతికి పయనమయ్యారు. పెన్షన్ల పంపిణీ, ఇళ్ల పట్టాలు పంపిణీ, కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీ తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. వీటన్నింటిపై అధి కా రుల నుంచి సమాచారం తీసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి వీటిపై మార్గనిర్దేశనం చేస్తారు.

పూర్తి సమాచారంతో వెళ్లిన కలెక్టరు 
ముఖ్యమంత్రి జగన్‌హన్‌రెడ్డి నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ శనివారం సాయంత్రం జిల్లా నుంచి వెళ్లారు. ఆదివారం స్థానికంగా పనులు చూసుకుని సోమవారం సమావేశానికి హాజరవుతారు. కలెక్టర్ల సదస్సు ముఖ్య ఉద్దేశానికి సంబంధించి ముందే ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఆ మేరకు పూర్తి సమాచారంతో కలెక్టర్‌ పయనమయ్యారు. కొత్త ముఖ్యమంత్రితో తొలి సదస్సు కావడంతో అజెండాలోని అంశాలకు సంబంధించిన సమాచారంతోపాటు... మరింత ఇతర సమాచారాన్ని కూడా కలెక్టర్‌ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. 

జిల్లా పరిస్థితులపై నివేదిక 
ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా జిల్లాలో పరిస్థితులను కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. జిల్లాలో 919 గ్రామపంచాయతీల్లో సచివాలయ ఏర్పాటు, సిబ్బంది నియామకంపై కసరత్తు చేసి తీసుకెళ్లారు. వారితోపాటు 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ నియామకానికి సంబంధించి నివేదిక తయారు చేశారు. అందులో జిల్లాలో 10,012 మంది వలంటీర్లు అవసరమని పేర్కొన్నారు.
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇప్పటికే జిల్లాలో 108 వాహనాలు 27, 104 వాహనాలు 19 ఉన్నట్లు కలెక్టర్‌ సీఎంకు నివేదించనున్నారు. వీటికి అదనంగా 108 వాహనాలు 9, 104 వాహనాలు 8            కావాలని కోరేందుకు సిద్ధమయ్యారు. 
ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ అంశం గురించి కలెక్టర్‌ సీఎంకు నివేదిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 7,13,053 కార్డులు ఉన్నాయని, ఆయా కార్డులకు 1,20,784 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉందని,        ఇందుకు అవసరమయ్యే వలంటీర్ల గురించి కూడా కలెక్టర్‌ వివరిస్తారు. 
విద్యకు సంబంధించి పిల్లల నమోదు, పుస్తకాల పంపిణీ, యూనిఫాం పంపిణీ గురించి నివేదిస్తారు. జిల్లాలో ఈ ఏడాది 1,44,356 మంది పిల్లలు బడిలో ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి మూడు జతల యూనిఫాం        లెక్కన పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 54.90శాతం పంపిణీ చేశారు. పుస్తకాలు పంపిణీ కూడా 80శాతం పూర్తయింది. మిగతా పంపిణీకి సంబంధించి కార్యాచరణ వివరించనున్నారు. అమ్మ ఒడి              పథకంలో అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్యపై ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు రాగా ఆ విషయం కలెక్టరు వివరించనున్నారు. 
జిల్లాలో గతేడాది ఖరీఫ్, రబీలో ప్రకటించిన కరువు మండలాలకు రావాల్సిన పంటల నష్ట పరి హారం గురించి కలెక్టర్‌ ప్రస్తావించనున్నారు. ఖరీ ఫ్‌లో 8,917 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇందుకు                    24,320మంది రైతులకు రూ.13.37 కోట్లు పంటల నష్ట పరిహారం రావాల్సి ఉంది. రబీలో 9388 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 30,893మంది రైతులకు రూ.9.25కోట్లు పరిహా రం రావాలి. సదస్సులో                కలెక్టర్‌ ఈ అంశం ప్రస్తావించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షాల ఆలస్యం తదితర అంశాలు వల్ల కలిగే ఇబ్బందులు నివేదించనున్నారు. 
జిల్లాలో 1,06,126మంది పెన్షన్లు పొందుతున్నారు. పెన్షన్లు మొత్తం పెంపు తర్వాత నెలకు రూ.71.35కోట్లు అవసరం అవుతుంది. ఈ అంశంతో పాటు 60 ఏళ్లకు తగ్గిస్తే అదనంగా పెరిగే పెన్షనర్ల గురించి కూడా         చర్చించనున్నారు. 
జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 23,405 మందికి ఇళ్ల పట్టాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వం కొంతమందికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని చూస్తోంది. వీటిపై వివరాలు కోరింది. అయితే ప్రస్తుతం దరఖాస్తులు                       పెండింగ్‌లో ఉండే లబ్ధిదారులు లేరని కలెక్టర్‌ నివేదికలో పొందుపరిచారు.
కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు 13,218 జారీ చేశారు. ఈ వివరాలు కోరడంతో కలెక్టర్‌ సమాచారం సేకరించారు. దీని ఆధారంగా నూతన విధివిధానాలు రూపొందే అవకాశం ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top