వలంటీర్‌ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం

CM YS Jagan Announces five lakh compensation for Volunteer family - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటన

పింఛన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో మరణించిన వలంటీర్‌

విషయం తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడిన సీఎం

వెంటనే పరిహారాన్ని అందించాలని విశాఖ కలెక్టర్‌కు ఆదేశం  

సాక్షి, అమరావతి/పాడేరు: విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం పరిధిలోని కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో మరణించిన వలంటీర్‌ గబ్బాడ అనురాధ (26) కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వలంటీర్‌ మరణించిన విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్‌ సీఎంవో అధికారులతో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు సమయంలో విశేషంగా పనిచేస్తున్న వలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. అనురాధ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని వెంటనే అందేలా చూడాలని విశాఖ కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా, శుక్రవారం సాయంత్రం పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ.10 వేల ఆర్థిక సాయాన్ని కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు.

సీఎం జగన్‌ చేసిన మేలును జీవితాంతం గుర్తుంచుకుంటాం
తన భార్య అనురాధ గుండెపోటుతో మృతి చెందడంతో రెండు నెలల శిశువుతో తాను ఒంటరిగా మిగిలిపోయానని భర్త గబ్బాడ కర్రన్న వాపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించి తన బిడ్డ సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యమిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారన్నాడు. సీఎం చేసిన మేలును జీవితాంతం గుర్తుంచుకుంటానన్నాడు. తమకు సహకరించిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top