నిధుల వినియోగ బాధ్యత ఆర్థిక శాఖకు: సీఎం జగన్‌

CM Jagan Review Meeting Over Skill Development And Employment - Sakshi

సాక్షి, అమరావతి : విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికై నెలరోజుల్లోగా పాఠ్య ప్రణాళికలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్పులకు అనుగుణంగా టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వడం యూనివర్శిటీల బాధ్యత అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ యూనివర్శిటీ పరిధిలో ప్రతి పార్లమెంటులో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ అంటే రాష్ట్రవ్యాప్తంగా 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం, ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. (చదవండి : హామీల తక్షణ అమలుకై ఏపీ సర్కారు ప్రత్యేక జీవో)

ఇందుకోసం ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అదనంగా ఏడాదిపాటు అప్రెంటిస్ చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అప్రెంటిస్‌ పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా శిక్షణ అవసరమనుకుంటే.. మళ్లీ నేర్పించాలని అధికారులకు తెలిపారు. ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. ‘ ప్రభుత్వ శాఖల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి శిక్షణ కార్యక్రమాలపై విడివిడిగా నిధులు ఖర్చు చేయడాన్ని నిలిపివేయాలి. నిధుల వినియోగ బాధ్యతలను ఆర్థిక శాఖకు అప్పగిస్తున్నాం. ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజి రూపురేఖలు కూడా మారాల్సిందే. గ్రామ సచివాలయాల వారీగా నైపుణ్యం ఉన్న మానవ వనరుల మ్యాపింగ్‌ జరగాలి. స్థానికంగా వారి సేవలను వినియోగించుకునేలా ఒక యాప్‌ను రూపొందించాలి. దీని వల్ల ప్రజలకు నైపుణ్యం ఉన్న మానవవనరులు అందుబాటులోకి వస్తాయి’ అని సీఎం జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు నెలరోజుల్లోగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top