పత్రికా కథనంపై సీఎం జగన్‌ స్పందన.. చిన్నారి చికిత్సకు ఆదేశాలు

CM Jagan Orders To Save Child Whose Parents Seek Mercy Death To Her - Sakshi

సాక్షి, అమరావతి : ‘కరుణ చూపండి.. మరణం ప్రసాదించండి’ అనే శీర్షికన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన చిన్నారి సుహానా ఆరోగ్య పరిస్థితిపై సాక్షి దినపత్రికలో శుక్రవారం ఓ కథనం వచ్చింది. ఏడాది వయసున్న సుహానా దీనావస్థపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. చిన్నారి ఆరోగ్యం గురించి చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుహానా చికిత్సకు అవసరమయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్నారికి రోజువారీగా అవసరమయ్యే ఇన్సులిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచే ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. సుహానా ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య స్థితిని పర్యవేక్షించాలని సీఎం అధికారులకు చెప్పారు.

మూడో బిడ్డకు అదే పరిస్థితి..
బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన బావాజాన్, షబానాకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. గతంలో ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు జన్మించిన కొద్ది రోజుల వ్యవధిలోనే షుగర్‌ స్ధాయి పడిపోవడంతో చనిపోయారు. ఈ క్రమంలో ఏడాది క్రితం జన్మించిన చిన్నారి సుహానాకు శారీరక ఎదుగుల లేకపోవడంతో వైద్యులను సంప్రదించారు. ఆమెకు కూడా షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో అప్పులు చేసి మరీ వైద్యం చేయిస్తూ వస్తున్నారు. అయితే, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో సుహానాకు వైద్యం అందించడం గగనమవుతోంది. దీంతో చిన్నారి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వివరాలు సాక్షి పత్రికలో ప్రచురితం కావడంతో సీఎం జగన్‌ స్పందించి చర్యలకు ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top