చంద్రబాబు బీసీ వ్యతిరేకి

CM Chandrababu is BC against says Former Justice Eshwaraiah - Sakshi

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య ధ్వజం 

ఉన్నత న్యాయస్థానాల్లో బీసీలు, ఎస్సీల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు  

వెనుకబడిన తరగతుల పట్ల చంద్రబాబు వైఖరి మారాలి 

బీసీలకు బాబు క్షమాపణ చెప్పి.. తప్పును సరిదిద్దుకోవాలి 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు  వెనుకబడిన తరగతుల(బీసీ) వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమీషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య విమర్శించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో జన చైతన్య వేదిక, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ‘రాజకీయాల్లో సామాజిక న్యాయం’ అనే అంశంపై జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానాల్లో బీసీలు, ఎస్సీల ప్రవేశాన్ని నిరోధించడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు.

బీసీలకు క్షమాపణ చెప్పి, తప్పును సరిదిద్దుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. రాజకీయాల్లో, న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం జరగాలన్నారు. న్యాయమూర్తుల నియామకాల అంశంలో చంద్రబాబు, జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు రాసిన లేఖల్లోని సమాచారం ఒకేలా ఉందని గుర్తుచేశారు. జ్యుడీషియల్‌లోనూ బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు బీసీలు కాదు కాబట్టి ఎంత నైపుణ్యం ఉన్నా అర్హత లేని వారిగా సూచిస్తూ కేంద్ర మంత్రికి చంద్రబాబు, జస్టిస్‌ ఎన్‌వీ రమణ లేఖలు రాయడం సరికాదన్నారు. న్యాయమూర్తులను నియమించే అధికారం ముఖ్యమంత్రికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు లేదని తెలిపారు. కేవలం అర్హుడా కాదా అని మాత్రమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 

కేసులు పెడితేనే భయం ఉంటుంది 
జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఓ పొలిటికల్‌ బ్రోకర్‌ అంటూ ఒక న్యాయమూర్తి తన పుస్తకంలో రాశాడని జస్టిస్‌ ఈశ్వరయ్య గుర్తుచేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థను సైతం కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ తమ్ముడు పద్మశ్రీ అవార్డు గ్రహీత అని, మరో తమ్ముడు టీటీడీ బోర్డు సభ్యుడని తెలిపారు. ఎన్నో ఆరోపణలున్న న్యాయమూర్తులు కూడా జస్టిస్‌ ఎన్‌వీ రమణ లాగా చేయలేదన్నారు. తప్పులు చేస్తే న్యాయమూర్తులపై కూడా కేసులు పెట్టాలని, అప్పుడే వారికి భయం ఉంటుందని స్పష్టం చేశారు. దేంట్లోనైనా పారదర్శకత ఉండాలన్నారు. వ్యవస్థలు అనేవి ప్రజలను కాపాడేలా ఉండాలని సూచించారు.  ఓ ప్రశ్నకు జస్టిస్‌ ఈశ్వరయ్య స్పందిస్తూ.. చంద్రబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. 

పాలకులు పక్షపాతం చూపొద్దు 
‘‘బీసీల పట్ల చంద్రబాబు వైఖరి మారాలి. పక్షపాత ధోరణి విడనాడి, దాపరికం లేని, పారదర్శక పాలన సాగించాలి. ప్రజలందరికీ రాజకీయ సమన్యాయం లభించకుంటే సామాజిక, ఆర్థిక న్యాయాలు లభించవు. న్యాయ, రాజకీయ వ్యవస్థల్లో బీసీలకు సముచిత న్యాయం దక్కడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర సర్వే నిర్వహించి, కులాల వివరాలను ప్రజలకు తెలియజేయాలి. 2011 జనాభా లెక్కల్లోని కులాల వివరాలను ప్రజల ముందుంచాలి. వివిధ వృత్తుల్లో ఉన్న పేదలందరికీ రిజర్వేషన్లు కల్పించాలి. కులాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగాలి. సామాజిక న్యాయం ప్రజల జన్మహక్కు. పాలకులు పారదర్శకతతో వ్యవహరించాలి. పక్షపాత ధోరణి పనికిరాదు. ప్రభుత్వం వాచ్‌డాగ్‌ పాత్ర పోషించాలి. ఇందుకోసం పౌరసమాజం చైతన్యవంతంగా కృషి చేయాలి’’ అని జస్టిస్‌ ఈశ్వరయ్య ఉద్ఘాటించారు. జనచైతన్య వేదిక ప్రతినిధి వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ... ఏపీలో 100 వెనుకబడిన కులాలు ఉండగా, చట్టసభలో వారి పాత్ర నామమాత్రమేనన్నారు. దేశంలో 2,250 కులాలకు పార్లమెంట్‌లో స్థానం లభించలేదన్నారు. 

రాజకీయాల్లో ఎంబీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఐవైఆర్‌ కృష్ణారావు 
రాజకీయాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీ) తగిన ప్రాధాన్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్‌ వంటి పరోక్ష ఎన్నికల్లో ఎంబీసీలకు మరిన్ని పదవులు ఇవ్వాలన్నారు. రాజకీయాల్లో కొందరి భాగస్వామ్యం మాత్రమే ఉంటే అది ప్రజాస్వామ్యం కాదని తేల్చిచెప్పారు. దేవాలయాల ప్రాచీనతను, పవిత్రతను కాపాడాలంటూ చంద్రబాబుకు రాసిన లేఖను కృష్ణారావు మీడియాకు విడుదల చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top