ఈ లాలూచీ మా వల్ల కాదు! | Clarification of superiors to the state government on irrigation | Sakshi
Sakshi News home page

ఈ లాలూచీ మా వల్ల కాదు!

Nov 17 2017 2:02 AM | Updated on Sep 22 2018 8:25 PM

Clarification of superiors to the state government on irrigation - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 
‘‘ఇరిగేషన్‌లో మీరు చేస్తున్న అవినీతి, అక్రమాలు, ఎస్కలేషన్లు, టెండర్ల ప్రక్రియలో అడ్డగోలుగా కాంట్రాక్టర్లతో కుమ్మక్కుకావడాన్ని ఒప్పుకోలేను.. కావాలంటే నా నేతృత్వంలోని హైపవర్‌ కమిటీని తొలగించేయండి.. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి.’’ అని రాష్ట్రప్రభుత్వానికి స్పష్టంచేసినట్లు తెలిసింది. ఆయన అలా అన్నదే తడవుగా హై పవర్‌ కమిటీని తీసేశారు. కాగా ఇరిగేషన్‌లో రాష్ట్రప్రభుత్వ పెద్దల అవినీతి, అక్రమాలను గతంలో పనిచేసిన ఇద్దరు ప్రభుత్వప్రధాన కార్యదర్శులు కూడా వ్యతిరేకించడం గమనార్హం.

జలవనరుల శాఖ ఉన్నతాధికారులు
పోలవరం కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి అదనపు బిల్లులు చెల్లించే ప్రయత్నాలకు అడ్డం తిరిగారు. ఇందుకు సంబంధించి వివాద పరిష్కార మండలి(డీఏబీ) ఏర్పాటుకు అంగీకరించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రికే తేల్చిచెప్పారు. టెండర్‌ ఒప్పందంలో డీఏబీ ప్రస్తావన లేదని ఎత్తిచూపారు. కావాలంటే కోర్టుకెళ్లాల్సిందిగా కాంట్రాక్టర్‌కు సూచించాలని సలహా ఇచ్చారు. వారిపై ముఖ్యమంత్రి మండిపడినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి (ఏడీసీలో కన్సల్టెంట్‌)
అమరావతిలో మొక్కల కొనుగోలులో జరుగుతున్న అవినీతిని చూసి బెంబేలెత్తిపోయారు. మార్కెట్‌లో ఉన్న ధర కంటే ఏడెనిమిది రెట్ల అధిక ధరకు మొక్కలు కొంటుండడంతో షాక్‌కు గురయ్యారు. ఎక్కడ కేసుల్లో ఇరుక్కోవలసి వస్తుందోనన్న భయంతో ఉద్యోగం వదిలేసి పారిపోయారు. రెండేళ్ల పదవీకాలం ఉన్నా, భారీ వేతనం అలవెన్సులు ఇస్తున్నా వద్దనుకుని వెళ్లిపోయారంటే రాష్ట్రప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలు ఆయనను ఏ స్థాయిలో భయపెట్టాయో అర్ధం చేసుకోవచ్చు.

సాక్షి, అమరావతి: అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆ మధ్య ఎన్‌సీఏఈఆర్‌ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌) సంస్థ నివేదిక వెల్లడిస్తే అంతా ఆశ్చర్యపోయారు. అవినీతిలో మన రాష్ట్రం నెంబర్‌వన్‌ మాత్రమే కాదు ఆ అవినీతి చివరకు అధికారులు భరించలేని స్థాయికి చేరుకుందని చెప్పడానికి పై మూడు ఉదాహరణలు చాలు. 

లాలూచీపడలేనన్న సీఎస్‌.. హైపవర్‌ కమిటీ తొలగిస్తూ సర్కారు జీవో..
పనుల ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం.. అంచనా వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం.. వాటిని ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు దక్కేలా నిబంధనలు రూపొందించి, టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం.. అంచనా వ్యయం కన్నా అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించి కమీషన్లు తీసుకోవడం .. ఇదీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ‘ముఖ్య’నేత.. సంబంధిత మంత్రి గత మూడున్నరేళ్లుగా సాగిస్తోన్న దోపిడీ పర్వం. ఈ లాలూ‘ఛీ’పర్వంలో తాను భాగస్వామిని కాలేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ పదే పదే స్పష్టం చేస్తూ వస్తున్నారు.

తాజాగా ఈనెల 13న ఏలేరు ఆధునికీకరణ రెండో దశ పనుల టెండర్లపై నిర్వహించిన హైపవర్‌ కమిటీ సమావేశంలోనూ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. కేబినెట్‌లో అత్యంత సీనియర్‌ మంత్రి వియ్యంకుడితో వ్యాపార సంబంధం ఉన్న హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రాకు రూ.202.58 కోట్ల విలువైన ఆ పనులు అప్పగించాలని హైపవర్‌ కమిటీపై ఒత్తిడి తెచ్చారు. ఇందులో తాను భాగస్వామిని కాలేనని,. టెండర్లు ఖరారు చేసే బాధ్యత నుంచి తన నేతృత్వంలోని హైపవర్‌ కమిటీని తప్పించాలని దినేష్‌కుమార్‌ సూచించారు. దీంతో టెండర్లు ఖరారు చేసే బాధ్యత నుంచి హైపవర్‌ కమిటీని తప్పిస్తూ గురువారం ఉత్తర్వులు(జీవో నం 76)ను జారీ చేసింది. తద్వారా సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో దోపిడీపర్వానికి ‘అడ్డంకి’ని తొలగించుకుందని, ఇక వారి ఇష్టారాజ్యం కానుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

అదనపు చెల్లింపులపై అడ్డం తిరిగిన అధికారులు.... 
పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(జలాశయం) కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి అ’ధన’పు బిల్లులు చెల్లించేందుకు సంబంధించిన ’క్లెయిమ్‌’ల పరిష్కారానికి గాను ఓ వివాద పరిష్కార మండలి(డీఏబీ) ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందుకు అంగీకరించే ప్రశ్నే లేదని సీఎం చంద్రబాబునాయుడుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. టెండర్‌ ఒప్పందంలో డీఏబీ ప్రస్తావన లేనే లేదంటూ ఎత్తిచూపారు.  ఉన్నతాధికారులు అడ్డం తిరగడంపై సీఎం చంద్రబాబు మండిపడినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ చేసిన పనులకు అదనపు బిల్లుల చెల్లింపుపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ వేస్తామని చంద్రబాబు ప్రకటించారు.  కమిటీని నియమిస్తూ గత జూలై 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చేసిన పనులకు సుమారు రూ.1,100 కోట్లకుపైగా అదనపు బిల్లులు చెల్లించాలని కోరుతూ ఆ కమిటీకి ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రతిపాదనలు పంపింది.

అదనపు బిల్లుల చెల్లింపునకు వీలుగా ఈనెల 1న నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖ అధికారులపై సంబంధిత మంత్రి ఒత్తిడి తెచ్చారు. అలాంటి ప్రతిపాదనలు తాము పంపలేమని అధికారులు తెగేసిచెప్పడంతో మంత్రివర్గ సమావేశంలో టేబుల్‌ ఐటంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు.  డీఏబీ ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం తెలుపుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు గత సోమవారం పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబుతో నేరుగా చర్చించారు. కాంట్రాక్టు ఒప్పందంలో డీఏబీ ప్రస్తావన లేనే లేదని స్పష్టం చేశారు. కాదూ కూడదని డీఏబీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే భవిష్యత్‌లో తాము ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కావాలంటే కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించాలని సలహా ఇచ్చారు.  దాంతో జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

మొక్కల కొనుగోళ్లలో గోల్‌మాల్‌.. రాజీనామా చేసి వెళ్లిపోయిన అధికారి
అమరావతిలో మొక్కల కొనుగోలులో భారీ గోల్‌మాల్‌ సాగుతోంది. అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) కేంద్రంగా సాగుతున్న ఈ అవినీతిని చూసి రిటైర్డు సీనియర్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్విస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి మురళీకృష్ణకు దిమ్మతిరిగిపోయింది. మార్కెట్లో ఉన్న ధర కంటే ఏడెనిమిది రెట్ల ధరకు మొక్కలు కొంటుండటంతో షాక్‌కు గురైన ఆయన ఎక్కడ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందోననే భయంతో ఈ ‘ఉద్యోగం’ నాకొద్దంటూ రాజీనామా చేసి వెళ్లిపోయారు. భారీ ఆర్థిక ప్యాకేజి (రూ. 2.50 లక్షల నెలసరి వేతనంతోపాటు ఇంటి అద్దె, కారు, ఇతర అలవెన్సులు, రెండేళ్ల పదవీకాలం) వదులుకుని అధికారి రాజీనామా చేసి వెళ్లిపోవడాన్ని బట్టే ఇక్కడ ఏస్థాయిలో అక్రమాలు  సాగుతున్నాయో ఊహించుకోవచ్చని అధికారులు అంటున్నారు.  అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తాజాగా రూ. 138 ధరతో కొనుగోలు చేసిన మొక్కలను కొన్ని నెలల ముందు రూ. వెయ్యికి కొనుగోలు చేసినట్లు వెల్లడయ్యింది.  

ఏడీసీ ఉన్నతాధికారి, ఇతర పెద్దలు కుమ్మక్కై కమీషన్లు పంచుకుంటున్నారని అవగతమైంది. మంచి ఆర్థిక ప్యాకేజి వదులుకుని ఎందుకు రాజీనామా చేశావని ఆయనతోపాటు గతంలో అటవీశాఖలో కలిసి పనిచేసిన సహచర అధికారి ప్రశ్నించగా ‘అక్కడ కమీషన్ల రాజ్యం నడుస్తోంది. వారు కోట్లు దండుకునేలా మనం ఆమోదముద్ర వేస్తూ సంతకాలు చేస్తే  రేపు ఎప్పుడైనా విచారణ జరిపితే నేను కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇప్పటివరకూ ఉన్న మంచిపేరు పోగొట్టుకుని కేసుల్లో ఇరుక్కోవడం ఇష్టంలేకే మానేశా. మనలాంటి వాళ్లం అక్కడ ఇమడలేము..’ అని మురళీకృష్ణ సమాధానమిచ్చారట. ‘నెలకు రూ. 3 లక్షల వేతనం, కారు, బంగళా, ఇతర అలవెన్సులు ఇస్తాం. ఏడీసీలో కన్సల్టెంటుగా చేరండి...’  రాష్ట్రంలో ఉన్నతస్థానంలో పనిచేసి రిటైరైన మరో అధికారిని ఏడీసీ అధినేత ఆహ్వానించారు. అక్కడ సాగుతున్న వ్యవహారాలన్నీ ఆయనకు ముందే తెలియడంతో ‘రిటైర్మెంటు జీవితాన్ని శాంతియుతంగా, ప్రశాంతంగా జరపాలనుకుంటున్నాను. నేను ఎక్కడా చేరబోను... ’ అంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారని సమాచారం. 

టెండర్‌ ఖరారు చేసే బాధ్యత నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్‌ కమిటీని తప్పిస్తూ జారీచేసిన ఉత్తర్వు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement