డబుల్ డబ్బుల్ | Clarification of the proposed ranking officer kodada Rs 30 lakh | Sakshi
Sakshi News home page

డబుల్ డబ్బుల్

Dec 17 2013 3:58 AM | Updated on Sep 2 2017 1:41 AM

కోదాడలో ఉన్న పులిచింతల కార్యాలయంలోని ఓ డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి తన చేతివాటాన్ని ప్రదర్శించి ఏకంగా 30 లక్షల రూపాయలు కాజేశాడు

కోదాడటౌన్, న్యూస్‌లైన్ :కోదాడలో ఉన్న పులిచింతల కార్యాలయంలోని ఓ డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి తన చేతివాటాన్ని ప్రదర్శించి ఏకంగా 30 లక్షల రూపాయలు కాజేశాడు. నిర్వాసితులకు అందాల్సిన పరిహారాన్ని ఫలహారంలాగా బొక్కేశాడు. కార్యాలయంలో ఉన్న ఉన్నత ఉద్యోగిని డమ్మీగా చేసి ఆ అధికారి.. అన్నీ తానై కార్యాలయంలో చక్రం తిప్పుతున్నాడు. ఈ కార్యాలయం పరిధిలో ఉన్న 8 గ్రామాలలో ఒక్క గ్రామంలోనే వెలుగు చూసిన అవినీతి ఇది. ఇదే అధికారి.. చనిపోయిన దాదాపు 100మంది పేరు అసలేం జరిగిందంటే...పులిచింతల ముంపు గ్రామమైన చింతిర్యాలలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమయంలో అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. గ్రామంలో 13మంది పేర్లను రెండుసార్లు జాబితాలో పొందుపర్చారు. వారికి రెండుచోట్ల గుర్తింపు నంబర్లు ఇచ్చి చెక్కులు జారీ చేశారు.
 
 జాబితాలో కొందరి పేర్లు రెండుసార్లు నమోదైన విషయాన్ని సదరు కార్యాలయ అధికారులే ఁలేఖ నంబర్ బి/282/2012 తేదీ 02-07-12న) స్వయంగా ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ విషయాన్ని మరిచి ఓ అధికారి తెరవెనుక చక్రం తిప్పి ఉన్నతాధికారుల నుంచి వచ్చిన తొలగింపు జాబితాను తొక్కిపట్టి రెండుసార్లు పరిహరం చెక్కులు జారీ చేశాడు. అంతే కాకుండా ఈ గ్రామంలో చనిపోయిన ఐదుగురికి కూడా చెక్కులు జారీ చేశాడు. వాస్తవానికి భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పరిహారం చెక్కులు ఇవ్వవచ్చు. ఇద్దరూ చనిపోయినపుడు చెక్కులు జారీ చెయ్యకూడదు. ఈ నిబంధనను కూడా తుంగలో తొక్కి 8 గ్రామాలలో దాదాపు 100మంది చనిపోయిన వారి పేరుతో పరిహారం కాజేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 ఇవిగో వాస్తవాలు....
   మేళ్లచెరువు మండలం పులిచింతల ముంపు గ్రామమైన చింతిర్యాలలో మర్రి వెంకటరెడ్డికి (గుర్తింపు నంబర్ 100901 ద్వారా) రూ.లక్షా 77వేల 790ను మొదటి చెక్కుగా ఇచ్చారు. ఇదే వ్యక్తికి (ఐడీనెంబర్ 141001 ద్వారా) మళ్లీ లక్షా 62,665 రూపాయలు చెల్లించారు. 
  బి.సైదులుకు(ఐడీ నంబర్ 105802 ద్వారా) మొదటిసారి 1,62,665 రూపాయలు, రెండోసారి (ఐడీ నంబర్ 108301) ద్వారా రూ.59వేలు చెల్లించారు. 
 
   ఇదే గ్రామానికి చెందిన నత్తిపాటి సిద్దేశ్వరరావుకు (ఐడినంబర్ 117504 ద్వారా) మొదటిపారి లక్షా 62వేలు, రెండోసారి (ఐడీనంబర్) 117508 ద్వారా రూ.87వేలు ఇచ్చారు. 
  మొర్రిమేకల పిచ్చయ్యకు మొదటిసారి (ఐడీనంబర్118601ద్వారా) రూ.లక్షా 62వేలు, రెండోసారి (ఐడీనంబర్119103 ద్వారా) మరో రూ.లక్షా 62వేలు చెల్లించారు.
  సకినాల తిరుపతిరావుకు (ఐడీనంబర్ 120507ద్వారా) మొదటిసారి రూ.లక్షా 62వేలు, రెండవసారి (ఐడీ నంబర్ 120502 ద్వారా) రూ.87వేలు ఇచ్చారు. 
 
   ఇదే గ్రామానికి చెందిన బడుగుల చిన్న వెంకటేశ్వర్లుకు (ఐడీ నంబర్ 123301 ద్వారా) మొదటిసారి రూ.లక్షా 47వేలు, మరోసారి ఇతనికే (ఐడీ నంబర్ 134401ద్వారా) రూ.లక్షా 62వేలు ఇచ్చారు. వీరితో పాటు బడుగుల మనోహర్, గడ్డం కోటేశ్వరరావు, చెడపంగు మరియదాసు, చెడపంగు కోటయ్య కొడుకు  మరియదాసుకు, విక్టరి బాబు, అమరబోయిన లక్ష్మయ్య, రుంజా జెమ్స్‌లకు రెండు ఐడీ నంబర్ల ద్వారా ఒక్కొక్కరికి అదనంగా రూ.లక్షా 62 వేల చొప్పున చెల్లించారు. అమరబోయిన లక్ష్మయ్యకు రెండుసార్లు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ డబ్బులు చెల్లించటమే కాకుండా రెబల్లె గ్రామంలో కూడా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. ఈ విధంగా 13మందికి కలిపి 20 లక్షల రూపాయలు అదనంగా చెల్లించారు. రెండోసారి ఇచ్చిన చెక్కుల్లో అధిక భాగం కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి కాజేసినట్లు సమాచారం. 
 
 చనిపోయిన వారినీ వదల్లేదు....
 చింతిర్యాలలో చనిపోయిన ఐదుగురి వ్యక్తులకు చెక్కులు జారీ చేసి దాదాపు 10 లక్షల రూపాయలు కాజేశారు. గ్రామానికి చెందిన భీమా శేషయ్య (ఐడీ నంబర్ 111401), షేక్ హుస్సేనమ్మ (ఐడీ నంబర్ 135608), కొడిమెల తిరపతమ్మ (ఐడీ నంబర్ 137206), అంగులూరి లక్ష్మి (ఐడీ నంబర్ 140801), సంగు పిచ్చమ్మకు చనిపోయిన తర్వాత చెక్కులను జారీ చేశారు. అకౌంట్ పే చెక్కులు ఎలా పాసయ్యాయో అధికారులకే తెలియాలి. ఇది ఈ కార్యాలయం కింద ఉన్న ఒక గ్రామం పరిస్థితి. మిగిలిన ఏడు గ్రామాలలో కూడా దాదాపు 95మంది చనిపోయిన తర్వాత సదరు డీటీ చెక్కులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహరంపై విచారణ జరిపి బాధితుల సొమ్ము స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
 
 అల్లుడి కోసం గిల్లుడు...
 కోదాడలోని పులిచింతల కార్యాల యంలో పనిచేస్తున్న ఓ అధికారి తన అల్లుడి పేరుతో భారీగా ప్రభుత్వ సొమ్మును కాజేసేందుకు పథకం పన్నాడు. ముంపు గ్రామమైన తమ్మారంలో ఇతని అల్లునికి ఓ పాత ఇల్లుంది. దాని విలువ గతంలో అధికారులు రూ.11 లక్షలుగా నిర్ణయించగా, ఆ అధికారి తన చేతివాటంతో దాని విలువను ఏకంగా రూ.33లక్షలకు పెంచేశాడు. కొందరు అడ్డుచెప్పడంతో తాత్కాలికంగా ఆగిన ఆయన.. ప్రస్తుతం 33లక్షల రూపాయలను విడుదల చేయించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement