జిల్లాలో మరో ‘ఎర్ర’ డంప్ | China compatriot arrest is a key things | Sakshi
Sakshi News home page

జిల్లాలో మరో ‘ఎర్ర’ డంప్

May 9 2015 2:21 AM | Updated on Sep 3 2017 1:40 AM

జిల్లాలో మరో ‘ఎర్ర’ డంప్

జిల్లాలో మరో ‘ఎర్ర’ డంప్

ఆపరేషన్ రెడ్‌లో భాగంగా జిల్లా పోలీసులు చైనా దేశానికి చెందిన యంగ్‌పెంగ్ (36)ను అరెస్టు చేయడం సంచలనంగా మారింది...

- చైనా దేశీయుడి అరెస్టుతో కీలక విషయాలు
- పోలీసుల నుంచి తప్పించుకున్న ఐదుగురు
- దుంగల కోసం వెతుకుతున్న పోలీసులు
చిత్తూరు (అర్బన్):
ఆపరేషన్ రెడ్‌లో భాగంగా జిల్లా పోలీసులు చైనా దేశానికి చెందిన యంగ్‌పెంగ్ (36)ను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇతనితో పాటు వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన కే.శ్రీనివాసరాజును అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం డంప్ ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు దాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులు మాత్రమే పట్టుబడ్డారు. మరో ఐదుగురు పారిపోయారు. వీరి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది.

ఇలా పట్టుకున్నారు..
ఈనెల 5న పూతలపట్టు సమీపంలో ఇద్దరు అనుమానితులు రెండు ఎర్రచందనం దుంగలను ద్విచక్ర వాహనంలో తీసుకెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రావారిపాళెం మండలం పులిబోనుపల్లెకు చెందిన కే.చంద్రశేఖర్‌రెడ్డి(30), చింతగుంటకు చెందిన కే. చంద్ర(35)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హైదరాబాదులో ఓ ముఠా చైనాకు చెందిన వ్యక్తికి ఎర్రచందనం అమ్మడానికి ప్రయత్నిస్తోందని పోలీసులకు వీరు సమాచారం ఇచ్చారు. చిత్తూరు మహిళా డీఎస్పీ గిరిధర్‌రావు, సీఐ మహేష్‌తో ఉన్న ఓ బృందం హైదరాబాదుకు వెళ్లింది. గురువారం రాత్రి 1.30 గంట ప్రాంతంలో హైదరాబాదు-వరంగల్ జాతీయ రహదారిపై స్మగ్లర్ల ముఠా మాట్లాడుకుంటుండగా పట్టుకోవడానికి ప్రయత్నించారు.

వీరిలో చైనాకు చెందిన యంగ్‌పెంగ్, రాయచోటికి చెందిన శ్రీనివాసరాజు దొరికారు. శ్రీనివాసరాజుపై ఇప్పటికే బీ.కొత్తకోట పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదయ్యింది. చైనా దేశీయుడి వద్ద ఉన్న ఆపిల్ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లో మన దేశ స్మగ్లర్లు ఇంగ్లిషులో టైపు చేస్తే చైనీయుడికి చైనీస్ భాషలో అనుకరణ చేస్తుంది. తమ వద్ద ఉన్న పెద్ద మొత్తంలోని ఎర్రచందనం దుంగలను విక్రయిస్తామని చైనీయుడితో ఒప్పందం కుదుర్చుకుంటుండగా పోలీసులు దాడులు చేశారు.

మరికొందరి కోసం వేట..
హైదరాబాదులో పోలీసుల నుంచి తప్పించుకున్న వారిలో కడపకు చెందిన కిషోర్‌కుమార్‌రెడ్డి అలియాస్ బుజ్జిరెడ్డి అలియాస్ సుదర్శన్‌రెడ్డి, కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన దాసరి సూరిబాబు, కడపకు చెందిన అల్లూరి వెంటకరమణ, నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన శ్రీనివాసులు, మైసూర్‌కు చెందిన మహ్మద్ ముంజామిల్ అనే స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చైనా దేశీయుడికి తమ వద్ద ఉన్న ఎర్రచందనం దుంగల ఫొటోలు, వీడియోలను వాట్సప్, మెయిల్ ద్వారా చూపించి అతన్ని భారత్‌కు రప్పించడంలో వీళ్లంతా ప్రధాన పాత్ర పోషించారు. నిందితులతో పాటు జిల్లాలో రహస్య ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం దుంగల డంప్ కోసం సైతం పోలీసులు అన్వేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement