
తూర్పుగోదావరి,పిఠాపురం: చంటి పిల్లల వైద్యుడికి కరోనా సోకినట్టు తేలడంతో పిఠాపురం పరిసర గ్రామాల్లో ఆందోళన రేగింది. పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఇతర గ్రామాల్లోనూ ఆ వైద్యుడికి మంచి పేరుంది. చాలామంది తమ పిల్లలకు ఆయన దగ్గరే వైద్యం చేయిస్తారు. లాక్‌డౌన్ సమయంలో కూడా ఆయన వందల మంది చంటి పిల్లలకు చికిత్స చేశారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో నాలుగు రోజుల క్రితం కాకినాడలో టెస్టు చేయించుకున్నారు.
ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు సోమవారం రిపోర్టు వచ్చింది. దీంతో ఆయన హోంఐసోలేషన్‌కు వెళ్లారు. ఇంతవరకు మామూలుగా జరిగే పక్రియే. అయితే కరోనా లక్షణాలు కనిపించి టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్టు వచ్చే వరకూ ఎవరైనా హోం ఐసోలేషన్‌లో ఉండాలి. కానీ ఈ వైద్యుడు ఆదివారం రాత్రి వరకూ చిన్న పిల్లలకు వైద్యం చేశారు. దీంతో ఆ పిల్లల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ డాక్టర్ చికిత్స అందించిన వారి వివరాల సేకరణపై అధికారులు దృష్టి సారించారు.